సమకాలీన రాజకీయ వ్యవస్థకు దర్పణం

సమకాలీన రాజకీయ వ్యవస్థకు దర్పణం
  • అమర్ ‘మూడు దారులు’ గ్రంథం
  • జస్టిస్ జాస్తి చలమేశ్వర్

ముద్ర, హైదరాబాద్,  : సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు దేవులపల్లి అమర్ రచించిన ‘మూడుదారులు’ అనే రాజకీయ విశ్లేషణాత్మక గ్రంథంపై గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పుస్తక పరిచయ సమావేశం నిర్వహించారు.  పలువురు సీనియర్ పాత్రికేయులు హాజరై ఈ సమావేశంలో  సుప్రీంకోర్టు విశ్రాంత  న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ..  1978 సంవత్సర కాలం నుంచి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటూ వస్తున్న రాజకీయ  పరిణామాలపై పాత్రికేయులు దేవులపల్లి అమర్ రాసిన ‘మూడుదారులు’ గ్రంథం నేటి తరానికి, రాబోయే తరానికి ఎంతో ఉపయుక్తమైన పుస్తకమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడులతోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకూ తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుంటూ వస్తున్న వ్యక్తిగత దృక్పధాలు, రాజకీయ వ్యవహారశైలులు, పాలనా పోకడలపై  రచయిత అమర్ తన పాత్రికేయ అనుభవంతో  వాస్తవ ఘట్టాలను కళ్లకు కట్టినట్టు రాశారని చలమేశ్వర్ ప్రశంసిచారు. పాదయాత్రలు, పర్యటనల ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకుని ప్రజానాయకుడయ్యే పరిణామం మాజీ సీఎం ఎన్టీఆర్ తోనే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఆ మార్గాన్ని అనుసరించి సఫలీకృతులయ్యారన్నారు. అయితే 1978 నాటి రాజకీయ ఆలోచనలు, వ్యవహార శైలులతో నేటి రాజకీయ పోకడలను పోల్చి చూసుకుంటే మన ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఎటు పోతున్నదో తెలియని అయోమయ చోటుచేసుకుంటున్నదని ఆయన అన్నారు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చుచేసి, అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీలు పాలనాపరంగా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నాయా అనేది మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తాను దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వర్తమాన రాజకీయ పార్టీల పాలనా వ్యవహారశైలిని గమనించినప్పుడు తనకు ఒక వాస్తవం అవగతమైందని ఆయన అన్నారు.  ఎన్నికల్లో తమను నమ్మి ఓట్లు వేశారు గనుక అధికారంలో ఉండి తాము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రజామోదం కిందకే వస్తుందన్న దృక్పధాన్ని నేటి రాజకీయ పార్టీలు, పాలకులు వంటపట్టించుకున్నారనే వాస్తవం మనకు అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ప్రమాదకర పాలనా  పరిణామక్రమంలో 2050 కాలంనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చునని ఆయన అన్నారు.

ఇద్దరి నాయకుల మధ్య ఉన్న భిన్న రాజకీయ జీవిత ప్రస్థానాన్ని చక్కటి విశ్లేషణ

సీనియర్ సంపాదకులు, రచయిత  కల్లూరి భాస్కరం మూడు దారులు పుస్తక సమీక్ష చేస్తూ.. 1978 సంవత్సర కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరూ ఒకేసారి రాజకీయరంగ ప్రవేశం చేశారని, ఆరోజుల్లో వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో మంచి మిత్రులుగా ఉండేవారని గుర్తుచేశారు. అటువంటి మిత్రులు తమ తమ వ్యక్తిగత ఆలోచనా దృక్ఫధాలలో, రాజకీయ వ్యవహారశైలిలో భిన్నంగా వ్యవహరిస్తూ ఎలా ఎదిగి వచ్చారో అమర్ తన ‘మూడు దారులు’ పుస్తకంలో చక్కని విశ్లేషణాత్మక ఘట్టాలను పాఠకుడి కళ్లముందుంచారని కొనియాడారు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నాయకుడిగా ముద్రపడిపోయిందని, అటువంటి జాతీయ పార్టీలో సభ్యుడిగా ఉంటూనే, అసమ్మతి నాయకుడిగా నిందలు భరిస్తూనే ముఖ్యమంత్రి పదవికోసం దశాబ్దాలకాలంపాటు సహనంతో వైఎస్ ఎదురుచూసి చివరకు పాదయాత్రలో ప్రజాభిమానాన్ని సంపాదించి అనుకున్నది సాధించారని భాస్కరం పేర్కొన్నారు. అయితే చంద్రబాబునాయుడు అలా కాకుండా అంతఃపురంలో నాలుగు గోడల మధ్య నుంచి నాయకుడిగా   బయటకి వచ్చారని, మామగారు పెట్టిన పార్టీలో చేరి పరిస్థితులనుబట్టి ముఖ్యమంత్రి పదవిని సంపాదించారు తప్ప ఆయన నేరుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో సంబంధాలు నెరపలేదని భాస్కరం  విశ్లేషించారు. ఇలా ఈ ఇద్దరి నాయకుల మధ్య ఉన్న భిన్న రాజకీయ జీవిత ప్రస్థానాన్ని రచయిత అమర్ ఎక్కడా వాస్తవాలను విస్మరించకుండా, ఆబ్జెక్టివ్ గా, నిష్పక్షపాతంగా  సూటిగా, స్పష్టంగా రాశారని అంటూ ప్రశంసించారు.  అంతేకాదు, టీడీపీలో తిరుగుబాటు తెచ్చి ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్ లో ఉంచి మామను దెబ్బతీసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేజిక్కిచుకున్న ఘటనను అమర్ నయవంచన శీర్షికతో నిర్మొహమాటంగా రాశారని, పాత్రికేయుడిగా ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని భాస్కరం ప్రశంసించారు. వృత్తిపరంగా అనేక ఒత్తిడులు, లక్ష్మణరేఖలను భరిస్తూనే జీవనం సాగించే పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ వస్తు్న్న రచయిత అమర్ ‘మూడు దారులు’ వంటి చక్కని రాజకీయ విశ్లేషణాత్మక గ్రంథ రచనకు పూనుకోవడం ఆదర్శవంతమైన ఆలోచన అని, భవిష్యత్ లో కూడా ఇటువంటి రచన తెలుగులో రావాలని తాను ఆకాంక్షిస్తున్నానని భాస్కరం అన్నారు. 

సమకాలీన రాజకీయ గ్రంథం రాసి ఉత్తరాదివారికి అందివ్వాలనే ఉద్దేశం..

‘మూడు దారులు’ గ్రంథ రచయిత దేవులపల్లి అమర్ ప్రసంగిస్తూ.. 2010 సంవత్సర కాలంనుంచి తాను జర్నలిస్టు యూనియన్ నాయకుడిగా ఢిల్లీలో ఎక్కువకాలం ఉండాల్సి వచ్చేదని,  ఆ సమయంలో అక్కడి ఉత్తర భారత రాజకీయ పార్టీల, నాయకుల ఆలోచనల ధోరణిని దగ్గరుండి గమనించే వాడినని తెలిపారు.  తాను నాడు గమనించిన వాస్తవం ప్రకారం ఉత్తరాది వారు దక్షిణభారత ప్రజలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించేవారని అన్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ స్థితిగతుల గురించిగానీ, ఇతరత్రాగానీ అక్కడివారికి తెలిసేలా చేసే నాయకులు కూడా మనకు లేకపోవడం ఓ లోపమని అమర్ పేర్కొన్నారు. అందుకే తన పాత్రికేయ వృత్తిపరమైన అనుభవంతో ఈ సమకాలీన రాజకీయ గ్రంథం రాసి ఉత్తరాదివారికి అందివ్వాలనే ఉద్దేశంతో తొలుత ఇంగ్లీషులో ఈ పుస్తకాన్ని రచించి ఆవిష్కరింపచేశామని ఆయన చెప్పారు. ఆతర్వాత మన తెలుగు రాష్ట్రాల నేటి, భావి తరాలవారికి కూడా 1978 నాటి నుంచి నేటి వరకూ జరిగిన రాజకీయ పరిణామాలపై వాస్తవాలు తప్పక తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఇటీవలే తెలుగులో ‘మూడు దారులు’ శీర్షికతో ప్రచురించి ఆంధ్రపదేశ్ లో ఆవిష్కరింపజేశామని తెలిపారు. సమావేశానికి  సీనియర్ పాత్రికేయులు గోవిందరాజుల చక్రధర్ అధ్యక్షత వహించారు. మరో సీనియర్ పాత్రికేయుడు బి.ఎస్ రామృష్ణ తొలుత సభికులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముద్ర దినపత్రిక ఎడిటర్ వై.నరేందర్​రెడ్డి,  సీనియర్​ పాత్రికేయులు పాల్గొన్నారు.