గ్రానైట్ వ్యాపారులకు 6.16 కోట్ల జరిమానా

గ్రానైట్ వ్యాపారులకు 6.16 కోట్ల జరిమానా
  • కొరడా ఝళిపించిన గనుల శాఖ
  • పలు కంపెనీలపై పది కేసులు నమోదు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : గ్రానైట్ వ్యాపారులపై భూగర్భ గనుల శాఖ కొరడా ఝళిపించింది. గత వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి 10 కేసులు నమోదు చేసి 6 కోట్లు 16 లక్షల 96 వేల528 రూపాయల జరిమానా విధించింది.  గ్రానైట్ క్వారీ లీజులు, గ్రానైట్, కంకర, మట్టి, ఇసుక అక్రమ రవాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. క్వారీ హద్దులను అతిక్రమించి ఖనిజ తవ్వకాలకు పాల్పడిన వారిపై నాలుగు కేసులు నమోదు చేసి ఆరు కోట్ల 11 లక్షల 8 వేల నాలుగు వందల జరిమానా విధించింది. అలాగే ఖనిజ రవాణా చేసిన వాహనాలపై తనిఖీలు నిర్వహించి ఆరు కేసులు నమోదు చేస్తూ 5 లక్షల 12 వేల 128 రూపాయల జరిమానా విధించింది.

దీంతో గ్రానైట్ వ్యాపారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. గ్రానైట్, కంకర, మట్టి, ఇసుక, ఖనిజ రవాణా చేసే వాహన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని గనులు మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు నర్సింగోజు రామాచారి హెచ్చరించారు. క్వారీ కార్యకలాపాలు కేటాయించబడిన విస్తీర్ణం హద్దులకు లోబడి చేపట్టాలని సూచించారు. ఖనిజాన్ని రవాణా చేసే ప్రతి వాహనం తప్పనిసరిగా వేబిల్లు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.