గులాబీ గూటికి ఉత్తమ్‌..?

గులాబీ గూటికి ఉత్తమ్‌..?
uttam kumar reddy

తెలంగాణ రాజకీయాలలో తెర వెనుక మంతనాలు చాలానే జరిగాయి. మైక్‌ ముందు గట్టిగా తిట్టుకునే నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో రహస్యంగా కూర్చొని మాట్లాడుకున్న ఘటనలు చాలానే చూశాం. ఇప్పుడు కూడా అలాంటి ఓ భేటీ తెలంగాణ పాలిటికల్‌ సర్కిల్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఇద్దరూ చోటామోటా లీడర్లు మాత్రం కాదు. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం తారస్థాయిలో ఉన్న వేళ పార్టీ సీనియర్‌ నాయకుడు టీపీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నేత మంత్రిఎర్రబెల్లి దయాకరరావుతో రహస్యంగా భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల కిందట మునుగోడులో ఓ వివాహ వేడుకకు హాజరైన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు అక్కడ ఏకాంతంగా దాదాపు మూడు గంటలపాటు మాట్లాడుకున్నారట. ఈ విషయాన్ని గమనించిన కొందరిని పిలిచి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారని టాక్‌. తమ భేటీ గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇంత రహస్యంగా అన్ని గంటల పాటు భేటీ అవ్వడం వెనుక మతలబేంటన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న టైంలోనే ఢల్లీి నుంచి హఠాత్‌గా వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడే మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో భేటీ అయ్యారు. భేటీ పూర్తి కాగానే నేరుగా ఢల్లీికి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి, ఉత్తమ భేటీ జరుగుతున్న టైంలోనే టీపీసీసీ భేటీ కూడా జరగడం ఇక్కడ మరో ట్విస్ట్‌. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పని చేసిన టైంలో కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఆయన్ని చుట్టుముట్టాయి. దాన్ని ఇప్పుడు ఆయన ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఉత్తమ్‌ కుమార్‌పై కేసీఆర్‌ కోవర్ట్‌ అన్న ముద్ర అప్పట్లోనే పడిరది. ఉత్తమ్‌ కుమార్‌ రహస్యంగా భేటీ అయిన ఎర్రబెల్లి దయాకరరావుపై కూడా ఆరోపణలు తక్కువేం కాదు.  ఆయన తెలుగుదేశం తెలంగాణ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా ఉన్న టైంలో చేసిన విషయాలను ఎర్రబెల్లి ప్రత్యర్థులు ఎత్తి చూపుతున్నారు. టీడీపీలో ఉండగానే కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎర్రబెల్లి టీడీఎల్పీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమి పరాజయం పాలైంది. గెలవాల్సిన స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఇందులో ప్రధాన పాత్ర ఎర్రబెల్లిదేనంటారు ఆయన ప్రత్యర్థులు. పొత్తలో భాగంగా సీట్ల పంపకాల్లో జరిగిన పొరపాట్లే ఆ ఓటమికి కారణమని అప్పట్లో తెలుగుదుశం, బీజేపీలు భావించాయి. టీడీఎల్పీ నేతగా అప్పట్లో ఎర్రబెల్లి ఇరు పార్టీలనూ మిస్‌ గైడ్‌ చేసి బీజేపీకి బలం ఉన్న స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశానికి బలం ఉన్న స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపేలా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.కేసీఆర్‌ కోవర్టుగా ఎర్రబెల్లి పని చేశారని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో పార్టీ నుంచి లీకులు ఇచ్చింది ఎర్రబెల్లేనంటూ అప్పట్లో రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆ తరువాత ఎర్రబెల్లి తెలుగుదేశంను వీడి.. గులాబీ గూటికి చేరడం.. ఆయనకు కేసీఆర్‌ మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే. తెలంగాణలో తెలుగుదేశాన్ని దెబ్బ తీసేందుకు సహాయం చేసిన ఎర్రెబల్లికి మంత్రి పదవితో కేసీఆర్‌ బదులు తీర్చుకున్నారని తెలుగుదేశం విమర్శలు చేసింది. ఇప్పుడు ఎర్రబెల్లి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రహస్య భేటీతో నాడు ఇరువురూ చేసిన పనులను ప్రత్యర్థులు గుర్తు చేసుకుంటున్నారు. రెండు జిల్లాల్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ భేటీ వెనక మర్మమేమిటన్న చర్చ కూడా ఊపందుకుంది. కానీ ఆ భేటీలో ఏం జరిగిందో మాత్రం ఇరు నేతల్లో ఎవరూ నోరు మెదపడం లేదు.