ఎయిమ్స్ లో హీమో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు

ఎయిమ్స్ లో హీమో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు
నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ యూనిట్ ప్రారంభోత్సవంలో ఎయిమ్స్ ఈడీ డాక్టర్ వికాస్ భాటియా, ఇతర వైద్యాధికారులు
  • పూజ చేసి ప్రారంభించిన ఈడీ డాక్టర్ వికాస్ భాటియా

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( AIIMS)లో గురువారం నుంచి హీమోడయాలసిస్  (hemodialysis)    విభాగం పనిచేయడం ప్రారంభించింది. నెఫ్రాలజీ విభాగంలో అంతర్భాగమైన ఈ విభాగంలో గతంలో హిమోడయాలసిస్ చేయించడానికి తగిన యంత్ర పరికరాలు లేకపోవడంతో, ఎయిమ్స్ ను ఆశ్రయించే చాలామంది రోగులను బయట కేంద్రాలకు రిఫర్ చేసే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో పలువురు రోగులకు డయాలసిస్ అవసరం వుందన్నది స్పష్టమవడంతో, ఈ దిశగా ఎయిమ్స్ అందుకు అవసరమైన యంత్ర పరికరాలతో ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేసింది.

నెఫ్రాలజీ  (nephrology)విభాగంలోని హీమో డయాలసిస్ (dialysis)  యూనిట్ ను గురువారం ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ యూనిట్ లో అయిదు హీమో డయాలసిస్ మిషన్లు, గంటకు 250 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం వున్న ఒక ఆర్ వో సిస్టమ్, అయిదు ఐసీయూ పడకలు, మూడు మానిటర్లు, ఒక ఈసీజీ యంత్రం ఉన్నాయి. అదనంగా వాస్క్యులర్ యాక్సెస్ ప్రక్రియల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎయిమ్స్ పనివేళల్లో మాత్రమే ఈ డయాలసిస్ సేవలు రోగులకు అందుబాటులో వుంటాయి. అదనపు సిబ్బంది నియామకం, అత్యవసర సేవల ప్రారంభంతో ఈ సమయాన్ని మరింతగా పెంపు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియాతో పాటు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్, అరోరా, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కల్యాణి సూర్య ధనలక్ష్మి, నెఫ్రాలజీ విభాగం సహాయ అచార్యులు డాక్టర్ అనిత, డాక్టర్ శ్యామలా అయ్యర్, ఇతర ఫాకల్టీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.