అధికారంలోకి వస్తాం.. అన్నీ చేస్తాం!

అధికారంలోకి వస్తాం.. అన్నీ చేస్తాం!
  • గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల హామీలు, వరాలు
  • డిక్లరేషన్లు.. సంక్షేమ హామీల ఫలితాలపై నేతల ఆరా
  • మహిళలు, బీసీలకు టిక్కెట్లపైనా సమాలోచనలు
  • పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్​బిల్లుపై ఆసక్తి
  • రసవత్తరంగా తెలంగాణ రాజకీయాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకరికి మించి మరొకరు పోటీ పడి మరీ కులాలు, మతాల సహా పలు వర్గాలకు డిక్లరేషన్లు.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ప్రస్తుత పథకాలకుతోడు మరిన్ని స్కీంలు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్ డిక్లరేషన్లతో ముందుకెళ్తోంది. హామీలు, వరాలు గుప్పించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో అవి తమ గెలుపునకు ఎలా దోహదపడతాయోననే అభిప్రాయాలను క్షేత్రస్థాయి నుంచి సేకరిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా ఎలాంటి పథకాలు ప్రకటించాలి..? ఏ వర్గ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో అనే దానిపై పార్టీ సీనియర్లు, రాజకీయ విశ్లేషకులతో ఇరుపార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. 
 
పింఛన్ల పెంపు, డిక్లరేషన్లు..
జూలైలో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ గర్జనలో పాల్గొన్న అగ్రనేత రాహుల్ గాంధీ ఆసరా పెన్షన్లను రూ.4వేలు ఇస్తామని ప్రకటించగా.. కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్​ప్రభుత్వం కూడా దివ్యాంగులకు పెన్షన్ ను రూ.3,016 నుంచి రూ.4వేలకు పెంచింది. ఇప్పటికే వరంగల్ లో రైతు, హైదరాబాద్ లో యూత్, చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్​త్వరలోనే బీసీ, మైనార్టీ డిక్లరేషన్ల ప్రకటనకు సన్నద్ధమవుతోంది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. వ్యాపారం చేసుకునేందుకు మైనార్టీలు, బీసీ కుల వృత్తులకు రూ.లక్ష సాయం ప్రకటించింది. అలాగే ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. గతంలో రూ.6వేలు ఉన్న ధూపదీప నైవేద్యం ఖర్చులు రూ.10వేలకు పెంచింది. మసీదు ఇమాం, మౌజన్​ల గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.6వేలకు పెంచింది. ఎన్నికల లోపు మరిన్ని పథకాలు, వరాల ప్రకటనకు బీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్​రైతులు, దళితులను ఆకర్శించేలా ఇప్పటికే వారి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. అయితే వాటి అమలులో జరుగుతోన్న లోపాలు, అక్రమాలను గుర్తించిన కాంగ్రెస్​ వాటిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల స్థానంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ  పారదర్శక ఫలాలు అందిస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేస్తోంది.
 
మారనున్న ముఖ చిత్రం..!
గతానికి భిన్నంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు రానున్నట్లు స్పష్టమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి కులాలు, మహిళల డిమాండ్ బలంగా వినబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 50 సీట్లు, మహిళలకు రిజర్వేషన్ల ప్రకారం 33 శాతం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులకు మూడు సీట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ఈ మేరకు వచ్చిన దరఖాస్తుల స్క్రూటిని పూర్తి చేసిన ప్రదేశ్​ఎన్నికల, స్క్రీనింగ్​కమిటీ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి నివేదించనుంది. మరోవైపు ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్​అత్యవసర సమావేశాల్లో మహిళా బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశం ఉండడంతో వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఈ విషయమై ఎమ్మెల్సీ కవిత సైతం వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ అన్ని పార్టీలకు లేఖలు రాయడం విశేషం. దీనిపై స్పందించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్​షర్మిల ‘ముందు మీ నాన్న ఎంత మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చారో అడగండి’ అంటూ ట్వీట్​చేశారు. ఇటు బీజేపీ సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. అవసరమైతే బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని బీజేపీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఏ వర్గం ఏ పార్టీని ఆదరిస్తుంది..?  ఏ పార్టీ మహిళలు, బీసీలకు ఎన్ని టిక్కెట్లు కేటాయిస్తుంది..? పోటీపడి మరీ ప్రకటిస్తున్న డిక్లరేషన్లు.. హామీలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని గట్టెక్కిస్తాయోననే ఆసక్తి నెలకొన్నది.