జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

న్యూ డిల్లీ: రోడ్లపై బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబర్‌ 1 తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తమ సభలు సమావేశాలను అడ్డుకోవడానికే జగన్‌ ప్రభుత్వం ఈ జీవోను తెచ్చాయని విమర్శించాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం.. హైకోర్టు ఆ జీవోపై స్టే విధించడం తెలిసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్‌ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జీవో నంబర్‌ 1 విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నెల 23వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి హైకోర్టు సీజేనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాద ప్రతివాదులిరువురూ డివిజన్‌ బెంచ్‌ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందని పేర్కొన్నారు.

రామకృష్ణ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జీవోను జనవరి 23వ తేదీ వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ జనవరి 23కి తేదీకి వాయిదా వేసింది. కానీ జీవో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కందుకూరు గుంటూరుల్లో టీడీపీ కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరిగి 11 మంది మృతి చెందడంతో వారి ప్రాణాలు కాపాడటానికే ఈ జీవో తెచ్చామని చెబుతోంది. గత ప్రభుత్వాలు కూడా ఈ జీవోను అమలు చేశాయని.. అప్పటి నుంచే ఈ జీవో అమల్లో ఉందని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.

జగన్‌ ప్రభుత్వం హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా.. మళ్లీ హైకోర్టు విచారణకే సూచించింది. దీంతో.. హైకోర్టులో విచారణ ఎలా ఉండబోతోంది? ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. కాగా జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టులోనే కేసు విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజాసంఘాలను ఇబ్బంది పెట్టేందుకే జీవో నంబర్‌ 1ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు.