చార్జీల పెంపుతో ప్రజానీకాన్ని నిలువు దోపిడిచేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం

చార్జీల పెంపుతో ప్రజానీకాన్ని నిలువు దోపిడిచేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం
BJP district spokesperson
  • అన్నింటా బాదుడు .. దంచుడు..ఇదే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరు...!?
  • కరెంట్‌.. ఆర్టీసీ.. పెట్రోల్‌.. రిజిస్ట్రేషన్‌.. ఇంటి పన్ను.. చార్జీలు విపరీతంగా పెంచిన ఘనత కెసిఆర్‌ సర్కార్‌ దే..!
  • విద్యుత్‌ ఏ సి డి బిల్లులు వెంటనే రద్దు చేయాలి
  • బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్‌ చంద్ర

కరీంనగర్‌: దేశంలో ఎక్కడలేని చార్జీల పెంపులు తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయని,కెసిఆర్‌ ప్రభుత్వ పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవించలేని పరిస్థితులు వచ్చాయని, అన్నింటా బాదుడు, దంచుడు, దండుకోవడం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుగామార్చుకుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్‌ చంద్ర విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల కెసిఆర్‌ ప్రభుత్వ పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలను చార్జీల పెంపుతో అనేక విధాలుగా దోచుకుంటుందన్నారు. ఇన్నేళ్ల ప్రభుత్వ పాలనలో ఏడు సార్లు కరెంటు చార్జీలు , మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు, 40 శాతం ఇంటి పన్ను, 90 శాతం మద్యం ధరలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు విపరీతంగా పెంచిన ఘనత కెసిఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తక్కువగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌ లపై సెస్‌ పన్నుల తో ప్రజానీకాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణను అన్నిట్లో నెంబర్‌ వన్‌ గా నిలుపుతున్నామని, సంపదను సృష్టిస్తున్నామని గొప్పలు చెప్పుకునే కెసిఆర్‌ సర్కార్‌ సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతుల గురించి ఆలోచన చేయకపోవడం సరికాదన్నారు.

సామాన్య మధ్యతరగతి జీవితాలపై ప్రభావం చూపెట్టే అన్ని విషయాల్లో కేసీఆర్‌ ప్రభుత్వం చార్జీలను విపరీతంగా పెంచి, ఆ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. తెలంగాణలో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రభావితం చూపే అనేక అంశాల్లో ధరలు అధికంగా ఉన్న ప్రభుత్వం నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు.ప్రధానంగా విద్య, వైద్య విషయంలో అధికమైన ఫీజులతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. కెసిఆర్‌ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలు తెలంగాణలో జీవించలేని పరిస్థితి తీసుకువచ్చారని ఆయన విమర్శించారు.

ముఖ్యంగా నేడు విద్యుత్‌ బిల్లుల చెల్లింపువిషయంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్‌ బిల్లులను సక్రమంగా నెలకు తీయకపోవడంతో రీడిరగ్‌ అధికంగా వచ్చి అడ్డగోలు బిల్లులు వస్తున్నాయని, దీనికి తోడు కస్టమర్‌ డెవలప్మెంట్‌ చార్జీలు, ఏ సి డి చార్జీలతో ప్రజలను కెసిఆర్‌ ప్రభుత్వం దోచుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఏ సి డి చార్జీల అదనపు బాదుడుతో ప్రజానీకానికి వేల రూపాయల్లో బిల్లులు వచ్చాయని , విద్యుత్‌ బిల్లులు చూసి జనం బెంబేలెత్తుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి సామాన్య మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించే చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏసీడీ చార్జీలను రద్దు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.