కాంగ్రెస్ సర్వేలో వెలుగుచూసిన విస్తుగొల్పే అంశాలు..!

కాంగ్రెస్ సర్వేలో వెలుగుచూసిన విస్తుగొల్పే అంశాలు..!
  • హైదరాబాద్ జిల్లాలో మొత్తం జనాభా  :1,08, 01,163పైనే
  • పాతబస్తీలో నివసిస్తున్న జనాభా  : 58 లక్షలు
  • మురికివాడల్లో నివసిస్తున్న వారు  : 60 శాతం 
  • కిరాయి ఇళ్లలో నివసిస్తున్న వారు  : 74 శాతం
  • తెల్లరేషన్​కార్డులు లేని వారు  : 38 శాతం
  • కుటుంబ భారాన్ని మోస్తున్న మహిళలు  : 37 శాతం 
  • పదో తరగతి మధ్యలో డ్రాపవుట్లు  : 50 శాతం
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు  : 49 శాతం

  • పాడుబడిన ‘బస్తీ’

  • దుర్భర జీవనం గడుపుతున్న పాతబస్తీవాసులు
  • రోగాలకు అడ్డాగా పలు కాలనీలు
  • కుటుంబ భారం మోస్తున్న 38 శాతం మహిళలు
  • 49 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 
  • మురికివాడల్లో మగ్గుతున్న 60 శాతం మంది
  • ఆర్థిక సమస్యలతో యువతుల అక్రమ రవాణా
  • పాతబస్తీ సమస్యలపై కాంగ్రెస్ సర్వే
  • వెలుగులోకి ఆందోళనకర అంశాలు
  • కాంగ్రెస్​మేనిఫెస్టోలో పాతబస్తీ, ముస్లింల అభివృద్ధి
  • ‘ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ డిక్లరేషన్’కు కాంగ్రెస్​సన్నాహాలు
     

మూసీ నాలాలు.. రసాయనిక ఫ్యాక్టరీల పక్కనే మురివాడల్లో దుర్భర జీవనం.. అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ.. వీధి నల్లాలే రక్షిత తాగునీరు.. 38 శాతం మందికి లేని తెల్ల రేషన్​కార్డులు.. మహిళల పాచిపనుల మీద ఆధారపడ్డ భర్తలు.. అడ్డా కూలీలు, దినసరి కూలీలు, పారిశుధ్య కార్మికులుగా అవతారమెత్తిన పురుషులు.. చిరు వ్యాపారాలతో పూట గడవని లక్షలాది కుటుంబాలు.. 49 శాతం మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు.. చదువుకు దూరమై భిక్షాటన, హోటళ్లు, కంపెనీల్లో పని చేస్తున్న బాలకార్మికులు.. ఇదీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పాతబస్తీలో కనిపిస్తున్న తాజా హృదయ విదారకర దృశ్యాలు.. 

  • ఆగని మానవ అక్రమ రవాణా?

పాతబస్తీలో మానవ అక్రమ రవాణా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కుటుంబాన్ని పోషించే వారు లేకపోవడం, బంధువులు కూడా బాగోగులు అడగకపోవడంతో డబ్బుల కోసం పలుచోట్ల కుటుంబ సభ్యులే తమ అమ్మాయిలను ఇతర ప్రాంతాలకు చెందిన వృద్ధ ధనవంతులతో వివాహం జరిపిస్తున్నట్లు సమాచారం. గల్ఫ్​నుంచి వచ్చే షేక్​లు ఇక్కడి అవివాహిత అమ్మాయిలను కొనుగోలు చేసి, పెళ్లి పేరిట తమ వెంట తీసుకెళ్లిన ఘటనలు గతంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని మొత్తం జనాభాలో 60 శాతం మంది ఇంకా మురికివాడల్లో అనేక రకాల వ్యాధులతో జీవిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని అటుంచితే.. ఎక్కడో వెలివేసినట్టుగా రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీ ప్రజల జీవన ప్రమాణాలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. 

  • పాతబస్తీపై పాలకుల శీతకన్ను..

ఇటీవల పాతబస్తీలో కాంగ్రెస్ నిర్వహించిన ఆర్థిక, సామాజిక సర్వేలో విస్తూ గొలిపే నిజాలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్​వన్​గా, తాగు, సాగు నీటి రంగంలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు దిక్సూచీగా తెలంగాణ నిలిచిందని పదేపదే ప్రకటిస్తున్న పాలకులు పాతబస్తీ అభివృద్ధిని విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఉంటోన్న పాతబస్తీ సమస్యలు ఏళ్ల నుంచి అపరిష్క్రృతంగానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, చివరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. పాతబస్తీ మాత్రం నిర్లక్ష్యానికి, వెనకబాటుకు, వివక్షకు గురవుతుందనడానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనంగా చెప్పొచ్చు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు వెచ్చిస్తుంటే.. పాతబస్తీ మాత్రం అభివృద్ధిలో వెనకబాటుకు గురవుతోంది. పారిశ్రామిక, ఐటీ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్​రంగాల్లో హైదరాబాద్​గణనీయ అభివృద్ధి సాధించింది. ఫలితంగా ఇటీవల నగర శివారు ప్రాంతాలైన కోక్ పేట, మోకిల, బుద్వేల్ లో సర్కారు భూముల్ని ప్రభుత్వం వేలం వేయగా ఎకరం భూమి రూ.వంద కోట్లు పలికింది. కానీ హైదరాబాద్​నడిబొడ్డున ఉన్న పాతబస్తీ దుస్థితి మాత్రం మారలేదు. ముఖ్యంగా చార్మినార్, గోల్కోండ, తలాబ్​కట్ట, లాల్​దర్వాజ, పాత మలక్​పేట్, చాదర్​ఘాట్, గోల్నాకా, యాఖత్ పుర, డబీర్ పుర, ఉప్పుగూడ, షాలిబండ, బహదూర్​పుర, గౌలిగూడ వంటి ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు అత్యంత దయనీయంగా తయారయ్యాయి.

  • రోగాలకు అడ్డా..!

పాతబస్తీ ప్రాంతాలను రోగాల అడ్డాగా చెప్పొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సీజన్లో నమోదయ్యే సీజనల్ వ్యాధులు 33శాతం హైదరాబాద్​లోనే నమోదైతే వాటిలో 50శాతం రోగులు పాతబస్తీ ప్రాంతాలకు చెందిన వారుండడం ఆందోళన కలిగించే విషయంగా మారింది. బస్తీ దవాఖానాలు, చిన్నా చితక ప్రైవేట్ ఆస్పత్రులను మినహాయిస్తే.. నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో ఇన్​పేషంట్లలో సగానికి పైగా మంది పాతబస్తీ వాసులే చికిత్స పొందడం వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతుంది. 

  • పీడిస్తున్న ఆర్థిక సమస్యలు..

పాతబస్తీ ప్రజలను ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లక్షలాది కుటుంబాలు అవసరానికి అప్పులు చేయడం పరిపాటిగా మారింది. కనీస ఆహారం, ఔషధాలకు, కనీస అవసరాలకు డబ్బులు లేక నిరుపేదలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటోన్న వ్యాపారులు 10 శాతం నుంచి 20 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది ఇళ్లు వదిలివెళ్లిపోయారు. ఎంతో మంది ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. వీటికి సంబంధిచిన లెక్క ఎక్కడా అందుబాటులో లేదు.   

  • కాంగ్రెస్​‘ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ డిక్లరేషన్’!

పాతబస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న అపరిష్క్రృత సమస్యపై కాంగ్రెస్​పార్టీ దృష్టిసారించింది. తాజాగా పాతబస్తీ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై సర్వే నిర్వహించిన ఆ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ డిక్లరేషన్ కు సన్నద్ధమవుతోంది. పాతబస్తీ ప్రజల సమస్యలను మెనిఫోస్టోలో పొందుపర్చడం ద్వారా వాటిని పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్​వలీవుల్లా ‘ముద్ర’ ప్రతినిధికి వివరించారు. 30లక్షలకు పైగా మంది మురికివాడల్లో దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. 74శాతం మంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారని వివరించారు. తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాతబస్తీ అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించిన సమీర్..​కాంగ్రెస్ పార్టీ కేవలం వాగ్దానాలే కాకుండా రాబోయే ఐదేళ్లలో పాతనగరం రూపురేఖలను మౌలికంగా మార్చే అవకాశం ఉన్న ఆచరణాత్మక పరిష్కారాలను అందజేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజలతో మమేకమవుతున్నట్లు చెప్పిన ఆయన వారి సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నట్లు వెల్లడించారు.