తాసిల్దార్ కార్యాలయ నిర్వాకంతో సర్వస్వం కోల్పోయిన ఓ అభాగ్యురాలు

తాసిల్దార్ కార్యాలయ నిర్వాకంతో సర్వస్వం కోల్పోయిన ఓ అభాగ్యురాలు
  • కుటుంబ సభ్యుల ధ్రువపత్రం మంజూరులో అక్రమాలు
  • రేషన్ కార్డులో పేరు ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లో పేరు గాయబ్
  • పంచనామాలో సాక్షులు మరియు పంచులు దొంగ సాక్షాలతో విచారణ.
  • జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు.

ముద్ర.వనపర్తి:-పైరవికారులకు అడ్డాగా, వారికి ఆదాయ కేంద్రం గా పనిచేస్తున్న పెబ్బేరు తాసిల్దార్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల పండు ముదుసలికి తీరని అన్యాయం పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళగా లక్ష్మీదేవమ్మ అనే 60 సంవత్సరాల మహిళ తన కొడుకు  ఈశ్వర్ రెడ్డి (39)చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉంది. ఈ సమయంలో పేరు మోసిన గుమ్మడం గ్రామ పైరవీకారులు, బ్రోకర్లు, ఒకే రేషన్ కార్డులో ఉన్న తల్లి లక్ష్మీదేవమ్మ పేరు లేకుండా కోడలు  ఉషారాణి మరియు మనమడు సాయి విగ్నేష్ పేరు మీదుగా జూలై 2023 వ సంవత్సరంలో స్థానిక పెబ్బేరు తాసిల్దార్ కు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.

అనంతరము గ్రామస్థాయిలో విచారించాల్సిన ఆర్ఐ పంచనామా రిపోర్టులో పేర్కొన్న సాక్షులు మరియు పంచుల దొంగ సంతకాలతో కేవలం కోడలు మరియు మనమని సర్టిఫికెట్ మంజూరు చేశారు.దీని ద్వారా ఆమె విరాసత్ చేయించుకొని, పట్టా పొలాన్ని  కోడలు తన పేరు మీదుగా మార్చుకొంది. ఇన్సూరెన్స్ డబ్బులు, రైతు బీమా డబ్బులు మొత్తం తన ఖాతాలోకి వేసుకుని చక్కగా వెళ్ళిపోయింది.దీంతో ఈశ్వర్ రెడ్డి తల్లి లక్ష్మీదేవమ్మ జీవనము కడు దుర్భరంగా తయారైంది. కేవలం ప్రభుత్వం ఇచ్చే 2 వేల రూపాయల పెన్షన్ తోనే ఆమె కాలం వెళ్ల దీస్తుంది.


ఇటు కొడుకు చనిపోయి అటు ఆస్తి పోయి చుట్టుపక్కల వారు దయతలిచి అన్నం పెడితే తిని ఊరుకుంటుంది.తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపనని, అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ మరియు పైరవికారులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు  ఫిర్యాదు చేశారు.