ప్రతి ఒక్కరూ ఆరోగ్య రక్షణకు సమయం కేటాయించాలి

ప్రతి ఒక్కరూ ఆరోగ్య రక్షణకు సమయం కేటాయించాలి

 జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ కనీస  వ్యాయామం,  ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సూచించారు.  బుధవారం జిల్లా కలెక్టర్ సూచనల మేరకు  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం రూమ్ నెంబర్ 202 లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా (3) రోజుల పాటు  ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని   జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలక్రమంలో ఉదయం లేచినప్పటి నుండి  ప్రతి ఒక్కరూ పనులలో నిమగ్నమై పోతున్నారని,  సరైన వ్యాయామం లేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.  అధికారులు ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం సరైన వ్యాయామం లేకపోవడం వల్ల  ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు.  

అందుకే ఉదయాన్నే కనీస వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ఉద్యోగులకు భవిష్యత్తులో రావచ్చు అనే వ్యాధులను ముందే గుర్తించేందుకు   ఈ రోజు నుండి (3) రోజులు  వైద్య శాఖ ద్వారా రక్త నమూనాలు సేకరించి  54 రకాల వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు.  బి.పి. షుగర్ లాంటి పరీక్షలు సైతం నిర్వహించి అనుభవజ్ఞులైన వైద్యుల ద్వారా వైద్య చికిత్సలు చేయడం జరిగుతుంది. ఉద్యోగులు ఈ  సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ రోజు మొత్తం 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఇతర జిల్లా అధికారులు పరీక్షలు చేయించుకున్నట్లు  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవిశంకర్ తెలిపారు.