మల్లన్న సాగర్ నిర్వాసితులను తప్పుదోవ పట్టిస్తున్న ఎంపి, ఎమ్మెల్యే

మల్లన్న సాగర్ నిర్వాసితులను తప్పుదోవ పట్టిస్తున్న ఎంపి, ఎమ్మెల్యే
  • మల్లన్నసాగర్ వేరు... అదనపు టీఎంసీ పనులు వేరు                                     
  • కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు
  • ఏ జీఓ ప్రకారం రైతులకు 13 లక్షల పరిహారం ఇచ్చారో ఎంపి రుజువు చేయాలి
  • నిర్వాసితుల పక్షాన పోరాడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే     
  • దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

                                        
    సిద్దిపేట:ముద్ర ప్రతినిధి: మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభం నుండి రైతులను మోసం చేస్తూ,భూములు కోల్పోయిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు .దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి లు  నిర్వాసితులను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. బుదవారం నాడు తొగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఉపఎన్నికల్లో మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు సిద్దిపేట, గజ్వేల్ మాదిరి పరిహారం ఇప్పిస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే, మరో కాలువ నిర్మాణానికి చేపట్టిన( అదనపు టీఎంసీ కోసం చేసిన) భూసేకరణలో 13 లక్షలు ఇప్పించానని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు కు మల్లన్నసాగర్ వేరు, అదనపు టిఎంసి కాలువ పనులు వేరు అని తెలియకపోవడం సిగ్గుచేటన్నారు.
    ఎమ్మెల్యే కు చిత్తశుద్ది ఉంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు సిద్దిపేట, గజ్వేల్ మాదిరి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.   ప్రభుత్వం సైతం రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఏ జీఓ ప్రకారం పరిహారం అందించారో సంబంధిత జీఓ కాపీలను చూపాలని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ని ప్రశ్నించారు. వాస్తవానికి రైతులకు 13 లక్షల కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి ఉందని,చట్టాలను పక్కన పెట్టీ కాంట్రాక్టర్ల తో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అదనపు టీఎంసీ కాలువకు అనుమతి లేదని సంబంధిత మంత్రి గజేంద్ర సింగ్ శేకావత్ తెలంగాణ ముఖ్యమంత్రికి మూడు సార్లు లేఖలు రాసిన విషయం బిజెపి ఎమ్మెల్యేకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక లాయర్ గా ఇతర జిల్లాల్లో భూములు విషయంలో జోక్యం చేసుకుంటున్న ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో భూములు కొల్పుతున్న నిర్వాసితుల పక్షాన నిలిచి ఎన్ని కేసులు వేశారని ప్రశ్నించారు. ఎంపి, ఎమ్మెల్యేలు మల్లన్న సాగర్ లో జరుగుతున్న పనుల్లో  కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్లకు ఆశపడి పడి నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇప్పించకుండా మోసం చేశారని ఆరోపించారు అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్వాసితులను ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతులు సంతకాలు చేయకుండా పోరాడుతుంటే వారికి మెరుగైన పరిహారం కోసం ముఖ్యమంత్రి తో చర్చలు జరిపి 11 లక్షల పరిహారం ఇప్పించిన ఘనత తన తండ్రి స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డిదేనన్నారు. ప్రాజెక్టు మొదటినుండి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని తెలిపారు. రైతులకు తామే న్యాయం చేశామని ఎంపి,ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకోవడం మానుకొని, ప్రభుత్వం  నిర్వాసితులకు  ఏవిధంగా న్యాయం  చేస్తుందో తెలుపాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం చేసేవరకు తాను పోరాటం చేస్తానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆక్కం స్వామి,ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య బి. అనిల్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కే. నర్సింలు,స్వామి, తిరుపతి,రమేష్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.