బౌద్ధ స్థూపం వద్ద రూ. 1.36 కోట్ల అంచనాలతో టూరిజం హోటల్: కలెక్టర్

బౌద్ధ స్థూపం వద్ద రూ. 1.36 కోట్ల అంచనాలతో టూరిజం హోటల్: కలెక్టర్
At the Buddhist Stupa Rs1.36 Crore Estimated Tourism Hotel Collector

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: బౌద్ధ స్థూపం వద్ద రూ. 1.36 కోట్ల అంచనాలతో టూరిజం హోటల్ నిర్మాణ పనులకుగాను, రూ. ఒక కోటి తో టెండర్లు ఆహ్వానించి పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ నేలకొండపల్లి మండల కేంద్రంలో పర్యటించి, బౌద్ధ స్థూపం వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్, భక్త రామదాసు ఆడిటోరియం నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. 6 గదులు, కిచెన్, రిసిప్షన్ హాల్ లతో నిర్మాణం చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఎలివేషన్ ఒక హోటల్ లా కాక పర్యాటక కళ వచ్చేలా చేపట్టాలన్నారు. అదనపు భాగాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

ఏప్రిల్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలన్నారు. నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వచ్చేలోగా, నిర్వహణ విషయమై ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శ్రీ భక్త రామదాసు ఆడిటోరియం నిర్మాణ పనులు రూ. 1.40 కోట్లతో చేపట్టినట్లున్నారు. నిర్మాణ పనులు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. కాంపౌండ్ వాల్ సీఆర్ఎస్ లో చేపట్టాలని, అప్పుడే చాలా కాలం పాటు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రవేశం ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం ఆకర్షణీయంగా ఉండాలన్నారు. ధ్యాన మందిరం ప్రక్కన ఉత్సవాల నిర్వహణకు డయాస్ ఎదురుగా కూలింగ్ టైల్స్ తో ఫ్లోరింగ్ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా జెడ్పి వైస్ చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, డిఇ చంద్రశేఖర్, టూరిజం డి ఇ శ్రీనివాస రెడ్డి, ఏఇ నజిష్,  నేలకొండపల్లి ఎంపిపి వి. రమ, ఎంపిడివో జమలా రెడ్డి, తహసీల్దార్ డి. ప్రసాద్, సర్పంచ్ ఆర్. నవీన్, ఎంపిటిసి బొందయ్య, అధికారులు ఉన్నారు.