పొంగులేటి, ఎమ్మెల్యే హరిప్రియ ఇల్లందులో ఢీ

పొంగులేటి, ఎమ్మెల్యే హరిప్రియ ఇల్లందులో ఢీ
Ponguleti vs MLA Haripriya

ఖమ్మం, ముద్ర ప్రతినిధి: మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళడం ఖాయమైంది. కాంగ్రెస్, బిజెపి పార్టీ లేదా ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అనేది ఇంకా ఆయన ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా  ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం ఇల్లందు పట్టణంలో నియోజకవర్గస్థాయి పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాజీ ఎంపి పొంగులేటి వెంట తిరుగుతున్నారు. ఇల్లందు అసెంబ్లీ నుంచి కోరం పోటీ చేసేందుకు రంగ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం గమనార్హం. 

ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే హరిప్రియ సైతం సోమవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇల్లందు మున్సిపాలిటీ ఏర్పడి మూడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వర్గీయులు తెలిపారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు పోటా పోటీగా ఒకే రోజు పొంగులేటి, బిఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేదు. ఇల్లందు జరిగే కార్యక్రమం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొంగులేటి ఏం మాట్లాడుతారు, బిఆర్ఎస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారనేది  ఎన్నికల కంటే ముందే ఇల్లెందులో ఈ అంశం వేడి పుట్టిస్తుంది.