తగ్గని భగభగలు

తగ్గని భగభగలు
Internal political fighting in khammam
  • ఖమ్మం సభ తర్వాత కొత్త తలనొప్పులు
  • ఎవరికి వారుగానే బీఆర్ఎస్ నేతలు
  • ఉమ్మడి జిల్లా పార్టీలో కానరాని ఐక్యత

  ఖమ్మం, ముద్ర ప్రతినిధి:  భారత రాష్ట్ర సమితి ఖమ్మం నుంచి శంఖారావం పూరించింది. జాతీయ రాజకీయాలలలోకి ఘనంగానే ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ నేతల తీరు మాత్రం వివాదాస్పదంగా మారింది. సభ తర్వాత అందరూ ఐక్యంగా ఉంటారని భావించారు. కానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, సభలో మనుషులు కలిశారు తప్ప మనసులు కలవలేదని స్పష్టమవుతున్నది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దూరం పెట్టి, ఇతర నేతలను ఐక్యం చేసేందుకు ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావును రంగంలోకి దింపినా ఆశించిన ఫలితం రాలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

 పొంగులేటి అనుచరుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఖమ్మం సభకు రాలేదు. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తూళ్లూరు బ్రహ్మయ్య, ఖమ్మం నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు. పినపాక ఆత్మీయ సమ్మేళనం కంటే ముందు పొంగులేటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలతో తన షెడ్యూల్ విడుదల చేశారు. ప్రస్తుతం వారి ఫొటోలు తొలగించి జిల్లాలో పర్యటిస్తున్నారు. పొంగులేటి బీఆర్ఎస్ కు దూరం అవుతున్నప్పటికీ ఇంకా ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ రెడ్డి, భట్టి కోరుతున్నారు. కొద్దిరోజులుగా పొంగులేటితో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఖమ్మం నడిబొడ్డున భారీ సభ నిర్వహించి జనాల మధ్యనే పార్టీ మారుతానని పొంగులేటి అంటున్నారు.

 

కాంగ్రెస్ నుంచి ఎన్నికైన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రాధాన్యం ఇవ్వడంతో ఎమ్మెల్యే వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడి నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలు చాప కిందనీరులా ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ సీటు పోతే బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటనేది  టెన్షన్ నెలకొంది. ఇక్కడ నుంచి  వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల కూడా పోటీ చేస్తారనడం మరింత ఆసక్తికరంగా మారింది.

 

వైరాలో ఇండిపెండెంట్ గా గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే రాములు నాయక్ ఈసారి టికెట్ వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉండటమే కారణం. మాజీ ఎమ్మెల్యే చంద్రావతి టికెట్ ఆశిస్తున్నారు. ఈ సీటును సీపీఐ అడుగుతోంది. సత్తుపల్లి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మంచి పట్టు ఉంది. ఓ వర్గం తనను టార్గెట్ చేసిందని ఎమ్మెల్యే సండ్ర బహిరంగంగానే చెబుతున్నారు. మంత్రి హరీశ్ రావు తుమ్మల ఇంటికి వెళ్లిన సమయంలో సండ్ర కూడా ఉన్నారు. బయటకు స్త్రం చెప్పినా, అంతర్గతంగా ఇద్దరి మధ్య భేదప్రాయాలు ఉన్నాయని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది.

 

 మధిర నుంచి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అసెంబ్లీకి వెళ్లాలని నిత్యం ప్రజలలో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక్కడ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రత్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కూడా పొంగులేటి వర్గం బలంగానే ఉంది. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ 2018లో అధిక పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీలు నామ నాగేశ్వరావు, వద్దిరాజు రవిచంద్ర ఇక్కడ క్యాడర్ కలిగి ఉన్నారు. మున్నేరు బ్రిడ్జికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో తన వల్లేనని మంత్రి... కాదు తన వల్లేనని ఎంపీ నామ వేరువేరుగా ప్రకటనలు విడుదల చేయడం కొత్త వివాదానికి తెర లేపింది.