ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ, కాంగ్రెస్​

ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ, కాంగ్రెస్​

ఎన్నికల వేళ వారికి తెలంగాణ గుర్తొచ్చింది
ఎవరు ఎన్ని జిమ్మికులు చేసినా గెలిచేది బీఆర్‌‌ఎస్సే
కేసీఆర్‌‌ హ్యాట్రిక్‌ సీఎం అవ్వడం ఖాయం
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: ఎన్నికలు అనగానే దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు తెలంగాణ గుర్తుకు వచ్చిందా అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టి, తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవడానికే వారు రాష్ట్రానికి వచ్చారని విమర్శించారు. జనగామలోని పొన్నాల కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే  నంబర్ వన్‌గా ఉందని చెప్పారు. 28 రాష్టాల్లో కంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని, ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులే చెబుతున్నారని పేర్కొన్నారు. కానీ, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల గురించి బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పొన్నాల మండిపడ్డారు. కాంగ్రెస్‌ యువతను మభ్య పెట్టేందుకు రాజీవ్ క్విజ్ ప్రోగ్రామ్ పెట్టి జూలై 9న బహుమతులు అందజేస్తామని చెప్పిందని, కాని ఇప్పటివరకు ఆ ప్రోగ్రామ్‌ ఊసేలేదన్నారు. 40 లక్షలపై చిలుకు సభ్యత్వాలు ఉన్నాయంటున్న రేవంత్ రెడ్డి కార్యకర్తల ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బు కూడా చెల్లించలేని ఆరోపించారు. కార్యకర్తలకే న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏం చేస్తాడని పొన్నాల ప్రశ్నించారు. కార్యకర్తల కోసం రూ.26.11 కోట్లు ప్రీమియం కట్టిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 

దొరికిన దొంగ...
రేవంత్‌రెడ్డి నోటుకు ఓటు కు దొరికిన దొంగ పొన్నాల ఆరోపించారు. అలాంటి దొంగ- తమ పార్టీ లీడర్లపై ఓటుకు రూ.‌10 వేలు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తప్పుడు ఆరోపణ చేసిన రేవంత్‌పై కేసు పెట్టాలన్నారు. 3 గంటల కరెంట్,  10 హెచ్‌పీ అన్నప్పుడే రెవంత్‌రెడ్డి జ్ఞానం ఏపాటిదో అందరికి తెలిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చేది బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వమే అని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌‌ మూడో సారి సీఎం అయి చరిత్ర సృష్టిస్తాడని జోస్యం చెప్పారు. ఇక జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు బీఆర్‌‌ఎస్‌ లీడర్లు పాల్గొన్నారు.