కెసిఆర్ ఒక్కడే తెలంగాణ రక్షకుడు

కెసిఆర్ ఒక్కడే తెలంగాణ రక్షకుడు

85 సీట్లతో గులాబీ జెండా ఎగురావేస్తాం
 బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నియోజకవర్గంలో తనను మూడుసార్లు గెలిపించిన ప్రజలకు తన చర్మం ఓలిచి చెప్పులు కుట్టించిన వారి ఋణం తీర్చుకోలేనిదని బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  మంగళవారం ప్రచార ముగింపు ర్యాలీలో ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రక్షకుడు కేసీఆర్ ఒక్కడేనని, ఆంధ్ర ఢిల్లీ పాలకుల చేతిలో అధికారం పెడితే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. కరీంనగర్ ప్రజలందరిని తన కుటుంబ సభ్యుల వలె చూసుకుని కాపాడుకున్నానని, వారికి ఏ ఆపాద వచ్చిన అన్నివేళల్లో అండగా నిలిచాను అని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి కేసీఆర్ ని అడిగిన వెంటనే అత్యధికంగా నిధులు కేటాయించారని కరీంనగర్ కేసీఆర్ కు సెంటిమెంటు అని కరీంనగర్ పట్టణాన్ని తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. 

ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదని అన్నారు. బండి సంజయ్ ని గెలిపించేందుకే పురమల్ల శీను కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. బిజెపి కాంగ్రెస్ కు వేసేమీ విలువైన ఓటు వృధా అవుతుందని విజ్ఞులైన ప్రజలారా ఆలోచించి రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని అన్నారు. అవినీతి డబ్బుతో అధికార పార్టీ సర్పంచులను కౌన్సిలర్లను డబ్బు ఇరవేసి కొంటున్నాడని అన్నారు. బండి సంజయ్ రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నాడని  అన్నారు. డబ్బు సంచులతో వచ్చే బిజెపి కాంగ్రెస్ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.

 ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీలో జాబితాలో చేర్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని, కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చామని వినోద్ అన్నారు. 85 సీట్లతో తెలంగాణపై గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్ ఎంఐఎం గులామ్ అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమి పలువురు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.