బీఆర్ఎస్ పార్టీ త్వరలో కనుమరుగవడం ఖాయం

బీఆర్ఎస్ పార్టీ త్వరలో కనుమరుగవడం ఖాయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

 బీబీనగర్, ముద్ర ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ త్వరలో పూర్తిగా కనుమరుగవుతుందని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి, శాసనసభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రం బీబీనగర్ లోని పోచంపల్లి చౌరస్తాలో ఆయన ఆదివారం సాయంత్రం జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజానీకం హోం మంత్రి... హోం మంత్రి అంటున్నారని, అయితే తాను ఎవరినీ అనమని చెప్పలేదని అన్నారు. ప్రభుత్వంలో తాను హోం మంత్రిని అయితే మాత్రం, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం జైల్లోకి పంపిస్తానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోందని, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, దొంగ ఓట్లతో అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కోర్టులో రుజువైతే 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకానుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాటి ముఖ్యమంత్రి సహా, పలువురు ప్రజాప్రతినిధులు జైలుకు పోవడం తథ్యమని అన్నారు. 

 గతంలో ఏళ్లక్రితం కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ రైతులకు ఎనలేని సేవలందిస్తూ చెక్కు చెదరకుండా ఉందని అన్నారు. అలాంటిది ఏడాది క్రితమే నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కారణంగానే పగుళ్లు ఇచ్చిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం, భువనగిరి ప్రాంత అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించలేదని అన్నారు. కేవలం పర్సంటేజీలు వచ్చే ప్రాజెక్టులకే బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యం దక్కిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఊబిలో కేసీఆర్, హరీశ్ రావు కూరుకుపోవడం తథ్యమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం నుంచి మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మందులో సోడా పోయడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు. పది సంవత్సరాలు రుణమాఫీ చేయలేని దద్దమ్మలు కేవలం మూడు నెలలు ఆగలేకపోతున్నారని బీఆర్ఎస్ నాయకులపై రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆగస్టు 15లోగా ఒకేదఫాలో రుణమాఫీని ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రసంగించినంత సేపు కాంగ్రెస్ కార్యకర్తలు కేరింతలు కొట్టారు.

   భువనగిరి పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ కు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తనను ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే, కేంద్రంతో కోట్లాడైనా సరే ఎయిమ్స్ లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని అన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రధానమైన సమస్య మూసీ కాలుష్యాన్ని మట్టుపెట్టేందుకు రూ. 500 కోట్లు వెచ్చిస్తామని వెల్లడించారు. తొలుత బీబీనగర్ లోని పీఆర్ జి గార్డెన్స్ నుంచి పోచంపల్లి కూడలి వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డిని భారీ గజమాలతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పంజాల రామాంజనేయ గౌడ్, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, గోలి పింగళ్ రెడ్డి, సురకంటి సత్తిరెడ్డి, నరేందర్ రెడ్డి, వేణుగౌడ్, దండెం ప్రభాకర్, పెంటయ్య, అచ్చయ్య గౌడ్, ఆగమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.