ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:తెలంగాణ ప్రభుత్వం అందించే పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని భూపాలపల్లి మండలం గోర్లవీడు గ్రామంలో 39మంది భూమి కొనుగోలు పథకం లబ్దిదారులకు పంట సహాయం క్రింద మంజూరైన రూ.7,09,195ల విలువ గల చెక్కులను బుధవారం గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 51 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గ్రామంలో ఉన్న మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. నిరుపేద ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నందునే భూములకు మంచి ధరలు పలుకుతున్నాయని అన్నారు. గృహలక్ష్మి పథకంలో అర్హులైన వారికి త్వరలోనే ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని, దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ.51000 ల సీఎం సహయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య, సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ మైనొద్దిన్, మాజీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లు మల్లేష్, రవీందర్ రెడ్డి, రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.