పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి..

పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి..
  • ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి..
  • కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అత్యధిక మెజారిటీ వచ్చేలా పాటుపడాలి..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అత్యధిక మెజారిటీ వచ్చేలా పాటుపడాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని రాంపూర్, గొల్లబుద్దారం, దూదేకులపల్లి, దీక్షకుంట, పంబాపూర్ గ్రామాలలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యే గండ్ర పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 10ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేసి, దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికలు సమీపించినందున గ్రామాలలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు.

అదేవిధంగా భూపాలపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో 60ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూములకు పట్టాలను పంపిణీ చేసి, సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. హక్కు పత్రం పొందిన ప్రతి రైతుకు గిరి వికాసం పథకం ద్వారా ఉచితంగా బోర్లు వేయించడం జరిగిందని, రానున్న 5సంవత్సరాలలో ప్రజల సమస్యల పట్ల, అభివృద్ధి కార్యక్రమాలపై చిత్తశుద్ధితో పనిచేయనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాలలో గల కార్యకర్తలను ముందుగా పలకరించాలనే ఉద్ధేశ్యంతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి ముందుకు వెళ్లాలని సూచించారు. రైతు బంధు, రైతు భీమా, గ్రామాలలో పెన్షన్ లు, వ్యవసాయ బావుల దగ్గరకు రోడ్లు, గ్రామాలలో అంతర్గత రోడ్లు, ఉచిత విద్యుత్తు, వైద్య రంగంలో పల్లె దవాఖానలు, పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు, పేద విద్యార్థులకు  కార్పొరేట్ స్థాయిలో విద్య ప్రమాణాలు తదితరులు అంశాలను ఎజెండాగా పెట్టుకుని ప్రచారం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశాల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.