జడ్పీ చైర్మన్ జగదీష్ హఠాన్మరణం బాధాకరం..

జడ్పీ చైర్మన్ జగదీష్ హఠాన్మరణం బాధాకరం..
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..
  • ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ములుగు జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ హఠాన్మరణం బాధాకరమని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గుండెపోటుకు గురై మృతి చెందిన జగదీష్ కుటుంబాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ముందుగా జగదీష్ భౌతికకాయం పై బీఆర్ఎస్ గులాబీ జెండాను కప్పి ఉంచారు. మెడలో పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అంతకుముందు హైదరాబాదు నుండి ములుగు జిల్లా కేంద్రానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న మంత్రి అక్కడి నుండి రోడ్డు మార్గాన మల్లంపల్లి కి చేరుకున్నారు. జగదీష్ మృతదేహాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జగదీష్ సీఎం కేసీఆర్ కు తమ్ముడిలా మెదిలాడని అన్నారు. ఆకస్మికంగా జగదీష్ మృతి చెందాడనే విషయం తెలిసి సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యాడని చెప్పారు. ఉద్యమకారుడిగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు నిర్వహించిన జగదీష్ ఎలాంటి ఆస్తుపాస్తులు సంపాదించుకోలేదని, అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడని చెప్పారు.

జగదీష్ కు ఇలా జరుగు తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్ మృతుని తట్టుకోలేక కేసీఆర్ తరపున తాము రావడం జరిగిందని వివరించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొన్నటి వరకు నాతో కలిసి ఉన్న మిత్రుడు జగదీష్ ఇలా ఆకస్మికంగా మృతి చెందడం విషాదకరమని అన్నారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రులు పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్ తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు.

జగదీష్ పాడె మోసిన మంత్రి సత్యవతి రాథోడ్..

ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆంత్యక్రియల్లో పాల్గొన్న శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాడె మోశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ తో పాటు, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్, గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అధికారులు నివాళులు అర్పించిన అనంతరం ఆంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, పాడె మోసి బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు.