భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకుని అనుకున్న పనులు సాధించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం గద్వాల సగర సంఘం ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాలు నందు ఏర్పాటు చేసిన భగీరథుడి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి భగీరథుడు పట్టుదలకు మారు పేరని, పట్టుదలతో ఏదైనా సాదించవచ్చని ఎవరైనా కఠోర శ్రమతో విజయం సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశామని భగీరథుడితో పోల్చుకుంటారని అన్నారు.

సగర చక్రవర్తి వంశానికి చెందిన భగీరథుడు కఠోర శ్రమతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహానుభావుడని అన్నారు. తమ పూర్వికులైన సగరులకు ఉత్తమ గతులు కల్పించెందుకై  వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగను భువికి తీసుకువచ్చిన భగీరథ మహర్షి జన్మదిన వేడుకలను ప్రభుత్వపరంగా నిర్వహించుకోవడం ఆనందదాయకం అని అన్నారు. భగీరథ జయంతిని తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అధికారి శ్వేత ప్రియదర్శిని, డిపిఆర్ఓ చెన్నమ్మ, ఎఓ యాదగిరి, రాజు, మదన్ మోహన్, గట్టు  సర్పంచు ధనలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు మిరపకాయల వెంకటేష్, జనరల్ సెక్రెటరీ వల్లూరి శేఖర్, కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.