జనగామ జిల్లా హాస్పిటల్‌లో బాలుడి మృతి

జనగామ జిల్లా హాస్పిటల్‌లో బాలుడి మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యమే అంటూ బంధువుల ఆరోపణ
  • ఆస్పత్రి ఎదుట ఆందోళన

ముద్ర ప్రతినిధి, జనగామ: వైద్యం కోసం వచ్చిన ఓ బాలుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా హాస్పిటల్‌లో జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలు మృతి బంధువుల కథనం ప్రకారం.. జనగామ మండలం ఓబుల్‌కేశ్వాపూర్‌‌ గ్రామానికి చెందిన కర్రే వంశీ (18) అనే మూగ బాలుడు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గురువారం ఉదయం 9 గంటలకు జనగామ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే జ్వరంతో భాధపడుతూ ఉన్న బాలు‌ని వద్దకు మూడు గంటలైనా డాక్టర్ గాని, సిబ్బంది గాని ఎవరూ రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మూడు గంటల తర్వాత జూనియర్‌‌ నర్సులు వచ్చి ఏదో ఇంజక్షన్ ఇచ్చారని, తర్వాత చనిపోయినట్లు చెప్పారని పేర్కొన్నారు. అయితే వైద్యం వికటించడం, వైద్యుల్ల నిర్లక్ష్యం వల్లే వంశీ మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట కొంత సేపు ఆందోళన నిర్వహించారు. ఈ విషయంపై ఆస్పత్రి ఆర్‌‌ఎంవో మహేశ్‌కుమార్‌‌ వివరణ కోరగా.. బాలుడిని తీసుకువచ్చే సరికే పరిస్థితి సీరియస్‌గా ఉందని, బాబును ఎండీ డాక్టర్‌‌ పరిశీలించి వైద్యం అందించారని తెలిపారు. వైద్యం వికటించి బాలుడు చనిపోయడని అనడం సరికాదన్నారు. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.