నేటి నుంచి సీఎం కప్ క్రీడా పోటీలు

నేటి నుంచి సీఎం కప్ క్రీడా పోటీలు

కేసముద్రంలో ఏర్పాట్లు పూర్తి
కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన సీఎం కప్ క్రీడా పోటీలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఈనెల 15,16,17 తేదీలలో కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. పూర్వ కేసముద్రం మండలంలోని గ్రామాలకు చెందిన 15 ఏళ్ల వయసు నుంచి 36 ఏళ్ల లోపు వయసుగల స్త్రీ, పురుషులకు వేరువేరుగా 100, 400 మీటర్ల పరుగు పందెం, వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీపీ ఓలం చంద్రమోహన్ తెలిపారు.

మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడా పోటీల్లో మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి పంపిస్తామని చెప్పారు. ఆయా క్రీడలతో పాటు బాస్కెట్బాల్ ఫుట్బాల్ హాకీ తదితర క్రీడల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను సైతం జిల్లా స్థాయి పోటీలకు సిఫారసు చేస్తామన్నారు. ఈ మేరకు క్రీడా పోటీల నిర్వహణ కోసం ఎంపీడీవో రవీందర్ రావు, కేసముద్రం,ఇనుగుర్తి తహసిల్దార్లు సాంబశివుడు, మహమ్మద్ దిలావర్ ఆబిద్ అలీ, స్కూల్ పిఈటిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసముద్రం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో క్రీడా పోటీలకు మైదానాన్ని చదును చేయడంతో పాటు, ఆయా క్రీడా పోటీలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశారు.