చల్లా శ్రీలత రెడ్డి బిజెపిలో చేరనుందా...!

చల్లా శ్రీలత రెడ్డి బిజెపిలో చేరనుందా...!
  • బిజెపి అగ్ర నాయకులను కలుసుకోవడంలోని ఆంతర్యం ఏమిటి...!
  • హుజూర్ నగర్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయనుందా...?

ముద్ర నేరేడుచర్ల:-ఇటీవల నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి బీ ఆర్ఎస్ నేరేడుచర్ల  పట్టణ అధ్యక్షురాలు పదవికి ఏకకాలంలో రాజీనామా చేసిన చల్ల శ్రీలత రెడ్డి అడుగులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నాయా అన్న చర్చ నేరేడుచర్ల లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి వైఖరి పై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న శ్రీలత రెడ్డి  బీ ఆర్ ఎస్ పార్టీని వీడారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లను ఆమె శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకోవడం సర్వత్ర చర్చించుకుంటున్నారు. శ్రీలత రెడ్డి తో పాటు ఆమె భర్త విజయభాస్కర్ రెడ్డి సోదరుడు పోరెడ్డి కిషోర్ రెడ్డిలతో ఆమె బిజెపి అగ్ర నాయకులను కలిసి శాలువాలతో సన్మానించారు.

త్వరలోనే బిజెపి పార్టీలో చేరడానికి తన కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రులతో చర్చించి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం అయితే హుజూర్నగర్ అసెంబ్లీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి నుండి టికెట్ ఇచ్చే పక్షంలో ఆమె బిజెపిలో చేరడానికి షరతు విధించినట్టు, బిజెపి నాయకత్వం కూడా అందుకు అంగీకరించినట్టు తెలిసింది. అన్ని అనుకూలిస్తే బిజెపి తరఫున చల్లా శ్రీలత రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా హుజూర్నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి.