లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న కాంగ్రెస్

లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న కాంగ్రెస్
  • ఉమ్మడి నల్లగొండలో రెండు ఎంపి స్థానాలకు ఇంచార్జిల ప్రకటన
  • నల్లగొండకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*
  • కాంగ్రెస్ ప్రకటనతో అలర్ట్ అయిన బీఆర్ఎస్, బిజెపి, బీఎస్పీ

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది.మిగతా పార్టీలకంటే ముందుగానే లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్ ల ను ప్రకటించి ఒకడుగు ముందులోనే ఉంది.ఈ సారి లోక్ సభ ఎన్నికలకు అనుకున్నషెడ్యూలకంటే ముందుగానే జరుగుతాయని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఒకింత దూకుడును ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే లోక్ సభ ఎన్నికల పై దృష్టి సారించి కసరత్తును ప్రారంభించారు. కసరత్తులో బాగంగా ముందుగా ఆయా లోక్ సభ నియోజకవర్గాల ఇంచార్జి లను ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న రెండు లోక్ సభ నియోజకవర్గాలు నల్గొండ లోక్ సభ  స్థానానికి హుజుర్ న గర్ శాసనసభ్యుడు, మాజీ ఎంపి, రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖమంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నియోజకవర్గానికి మాజీ ఎంపి, నల్లగొండ శాసనసభ్యుడు, రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లను ఇంచార్ట్లుగా నియమించబడ్డారు. వాస్తవానికి నల్లగొండ లోక్ సభ  స్థానం నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి,భువనగిరి లోక్ సభ  స్థానం నుంచి ఎంపిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు గెలుపొందారు. శాసనసభ ఎన్నికలలో వీరిరువురూ శాసనసభ్యులుగా గెలవడంతో తమ తమ ఎంపి పదవులకు ఇటీవల రాజీనామ చేశారు.

ఇన్నాళ్ళు ఎంపీలుగా వీరిరువురూ ఉండడంతో ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ  పరిస్థితి, వ్యూహ, ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయనేది ఈ ఇద్దరు మంత్రులకు బాగా తెలిసి ఉండడంతో వీరినే పార్టీ అధిష్టానం ఇంచార్జ్ లుగా నియమించడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గల రెండు లోక్ సభ భనియోజకవర్గాలు నల్లగొండ, భువనగిరిలకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు సూర్యాపేట నుంచి టికెట్ ఆశించి నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీతో నామినేషన్ ఉపసంహరించుకున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డికి నల్లగొండ ఎంపీగా పోటీచేసే ఆవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి పటేల్ రమేష్ రెడ్డి పోటీలో ఉండే అవకాశం ఉండగా తాను కూడా లోక్ సభ  ఎన్నికలలో పోటీలో ఉంటానని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కూడా ప్రకటించడం ఆసక్తిని రేపుతుంది. ఇటీవల మిర్యాలగూడ అసెంబ్లీ సీట్లు ఆశించి భంగడిన జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో జానారెడ్డికి భువనగిరి సీట్ ఇస్తారని ప్రచారం కూడా సాగుతుంది. దీంతోబాటు మరో ఎంపి నియోజకవర్గం భువనగిరి నుంచి కూడా పార్టీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు.

ఈ రెండు నియోజకవర్గాలలో భువనగిరి నుంచి ఒక బిసి అభ్యర్ధిని రంగంలో దింపే అవకాశం ఉందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలను కూడా గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో తన బుట్టలోనే వేసుకోవాలని పావులు కదుపుతుంది. అందుకు తగ్గట్టుగా ముందస్తుగానే ఇంచార్జ్ లను ప్రకటించి లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ  ముందుగానే సమాయత్తం అవుతున్నది. కాంగ్రెస్-పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటించడంతో బి ఆర్ ఎస్ పార్టీ కూడా తమ ఎంపీలను హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు పిలిపించి ఆ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ అత్యవసరంగా మాట్లాడుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.దీంతోపాటు భారతీయ జనతాపార్టీ కూడా తమ పార్టీ తరపున లోక్ సభ  ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులను అన్వేషిస్తూ నల్లగొండ నుంచి సునితారెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బిఎస్పీ కూడా తమ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలిపే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే లోక్ సభ ఎన్నికలలో విజయం కోసం అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి.