126.74 కోట్ల కేంద్ర నిధులతో ఆర్ఓబి నిర్మాణం

126.74 కోట్ల కేంద్ర నిధులతో ఆర్ఓబి నిర్మాణం
  • బిఆర్ఎస్ పాలాభిషేకాలు చేయడం విడ్డూరం
  • బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పట్టణం తీగల గుట్ట పల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర ప్రభుత్వ  నిధుల తో జరుగుతుంటే  బిఆర్ఎస్ పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ  తీగలగుట్టపల్లి ఎల్ సి నం.18 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం 126.74 కోట్ల నిధులతో నిర్మాణం చేయడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఆర్ఓబి నిర్మాణానికి టెండర్లు పూర్తయినవి అన్నారు. ఇన్నేళ్లుగా టెండర్లు ఖరారు చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. 9ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఆర్ఓబి నిర్మాణం చేయాలనే ఆలోచన, ప్రయత్నాలు ఏనాడు చేయలేదని విమర్శించారు.  కరీంనగర్ పార్లమెంటు సభ్యులు అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆర్ఓబి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించి ఆర్ఓబిని సాధించారన్నారు. 

ముఖ్యంగా తీగలగుట్టపల్లి ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎంపీ  పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు చేసిన విజ్ఞప్తులకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం తీగలగుట్టపల్లి ప్రాంతంలో 100 కోట్ల  రూపాయల నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటా భాగస్వామ్యంతో చేపట్టడానికి కావలసిన అన్ని అనుమతులను మంజూరు చేసిందన్నారు. ఆర్ఓబి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను గత ఏడాది మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులను రిలీజ్  చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ఆర్ఓబి ఆర్ఓబి అంచనా వ్యయం నేడు 126.74 కోట్లకు పెరిగిందన్నారు. తీగలగుట్టపల్లి ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో అనునిత్యం  ప్రయాణం చేసే వాహనదారులు, ప్రజలు, ముఖ్యంగా ఆసుపత్రులకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

ఆర్ఓబి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయడానికి ముందుకు రాక, ఏడాదికాలంగా జాప్యం చేయడంతో ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇట్టి  ప్రాజెక్టును పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం చేపట్టడానికి చొరవ చూపారన్నారు. నూతన ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వ సేతు బంధన్ నిధులతో తీగలగుట్టపల్లి ఆర్ఓబిని  126.74 కోట్లతో నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం  గ్రీన్ సిగ్నల్ ఇప్పించారని పేర్కొన్నారు. అయితే ఆర్ఓబి నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏడు నెలలుగా  ఏలాంటి సమీక్ష , టెండర్ల ప్రక్రియ నిర్వహించకుండా  అలసత్వం ప్రదర్శించిందన్నారు.