బీబీనగర్ ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు

బీబీనగర్ ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు
  • ప్రొటోకాల్ నేత సందీప్రెడ్డిని దౌర్జన్యంగా లాక్కెళ్లడంపై స్థానికుల నిరసన 
  • పోలీసుల ఏకపక్ష తీరుపై తీవ్ర ఆగ్రహం
  • ఎస్సై యుగంధర్గౌడ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

 ముద్ర ప్రతినిధి, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో సోమవారం జరిగిన ఘటనలో రాచకొండ కమిషనరేట్ పోలీసుల తీరును యావత్ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ఉన్న ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం జరిగినపుడు.. అక్కడే ఉన్న ఎస్సై.. ఏకపక్షంగా వ్యవహరించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గూడూరులో పంచాయతీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగిన విషయం విదితమే. ఈక్రమంలో ‘‘సందీప్ రెడ్డి ఓ బచ్చా.. తండ్రి పలుకుబడి కారణంగానే ఆయన ఈ స్థాయిలో ఉన్నారు.. లేకపోతే కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేరు” అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన డబ్బుతోనే నిర్మించిన భవనాలను ప్రారంభిస్తున్నారని, అలాగే రైతుబంధు డబ్బులు అడిగిన వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి పేర్కొన్నట్టుగా ఆరోపించారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి దీటుగా ప్రతి స్పందిస్తూ.. సందీప్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జరిగింది ఇద్దరు కేబినెట్ ర్యాంక్ ప్రొటోకాల్ ఉన్న నాయకుల మధ్య. అయితే ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి పిలవగానే.. పరుగున వచ్చిన పోలీసులు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని వేదిక మీది నుంచి దౌర్జన్యంగా చేయిపట్టుకుని తీసుకుపోవడంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

సంయమనంతో సమాధానం ఇచ్చిఉంటే..

యువకుడైన సందీప్ రెడ్డి మాట్లాడినపుడు మంత్రి సంయమనంతో సమాధానం ఇచ్చివుంటే ఎంతో హుందాగా ఉండేదని పలువురు భావిస్తున్నారు. ఎంతో రాజకీయ పరిణతి ఉన్న వెంకట్రెడ్డి ఇలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం తగనిదని అంటున్నారు. అలాగే ఇదో ప్రభుత్వ కార్యక్రమమని తెలిసినా కూడా అధికార కాంగ్రెస్ కార్యకర్తల ఎదుట జడ్పీ చైర్మన్ కూడా అలా మాట్లాడి ఉండకూడదని చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్చేసిన వ్యాఖ్యలపై అప్పటికే మహదేవపూర్ లో జరిగిన సభలో మంత్రి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించి కౌంటర్ చేశారు.

కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరితూగరని కేటీఆర్అన్నదానిపై మంత్రి మాట్లాడుతూ.. తాను కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి గానీ రాజకీయాలలో దిగువస్థాయి నుంచే వచ్చామని పేర్కొన్నారు. అలాగే మా తండ్రులెవరూ కూడా ప్రజాప్రతినిధులుగా లేరని, అమెరికా నుంచి నేరుగా వస్తూనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని కోమటిరెడ్డి అన్నారు. ఆ సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలను కౌంటర్ చేసిన ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోకముందే, ఎలిమినేటి మాధవరెడ్డి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సందీప్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అగ్రహోదగ్రులవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ఎస్సై తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు..

ఇద్దరు కేబినెట్ ర్యాంక్ ప్రొటోకాల్ కలిగివున్న నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్నపుడు బీబీనగర్ఎస్సై ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు, నిరసన వ్యక్తమవుతోంది. కేవలం అధికారంలో లేనంత మాత్రాన జడ్పీ చైర్మన్ చెయ్యి పట్టుకుని బీబీనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ యుగంధర్ గౌడ్ గుంజడంపై స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి, జడ్పీ చైర్మన్ ఇద్దరూ విద్యావంతులు, వివేకం వున్న వారే.. ఆ నేతలు ఇద్దరూ ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఖండిస్తున్న తరుణంలో.. స్థానిక సబ్ఇన్స్పెక్టర్ యుగంధర్ గౌడ్ వచ్చి దౌర్జన్యంగా జడ్పీ చైర్మన్ ఒక్కరినే చేతులు పట్టి లాగుతూ.. సభా స్థలి నుంచి దౌర్జన్యంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన తీరు ఏమాత్రం హర్షణీయం కాదని స్థానికులు చెబుతున్నారు.

ప్రొటోకాల్అని కూడా చూడకుండా సబ్ఇన్స్పెక్టర్ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు నేతలు మాట్లాడుకుంటున్నపుడు కేవలం జడ్పీ చైర్మన్ చేతులు పట్టి లాక్కెళ్లే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం సబబు కాదని, ఎస్సై తీరును అక్కడున్న ఏ ఒక్కరూ హర్షించరని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపాలని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ఘటనలో అత్యుత్సాహం చూపి, కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ఉన్న జడ్పీ చైర్మన్ ను చేయి పట్టుకుని తీసుకెళ్లిన ఎస్సైపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు. అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకుంటే మరోలా వ్యవహరించడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.