నాగరాజు’కు కోపం వస్తే అంతే..!

నాగరాజు’కు కోపం వస్తే అంతే..!
  • గుడిసె వాసులపై కౌన్సిలర్‌‌ దౌర్జన్యం
  • అడిగిన వస్తువులు ఇవ్వలేదని గుడిసెల ధ్వంసం

ముద్ర ప్రతినిధి, జనగామ : ప్రజల మంచీ చెడులు చూడాల్సిన ఓ కౌన్సిలర్‌..‌ వారిపైనే దౌర్జన్యానికి దిగాడు. పొట్ట కూటి కోసం పెట్టుకున్న దుకాణాన్ని నేల మట్టం చేసి తన అధికార బలాన్ని ప్రదర్శించాడు.. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. భువనగిరికి చెందిన చెందినా యార్ల లక్ష్మి తన ఆరుగురు పిల్లలతో 40 ఏళ్ల కింద పొట్ట కుటి కోసం జనగామకు వలస వచ్చింది. జిల్లా కేంద్రంలో సిద్దిపేట రోడ్‌లో గుడిసె వేసుకుని ప్లాస్టిక్‌ వస్తువులు, డ్రమ్ములు అమ్ముకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఆధార్, రేషన్ కార్డులు అన్ని ఇక్కడే ఉన్నాయి. అధికార బీఆర్‌‌ఎస్‌కు చెందిన 6వ వార్డు కౌన్సిలర్ దేవరాయి నాగరాజు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డి గుడిసెలు ధ్వంసం చేయించారు. అయితే నాగరాజు తన అవసరాలకి కావాల్సిన వస్తువులు డబ్బులు తీసుకోకుండా ఇవ్వాలి కోరాడని, అవి ఇవ్వకపోవడంతో కక్షపూరితంగా రాత్రి గుడిసె కుల్చివేయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కాళ్లు పట్టుకున్న కనికరించకుండా  ‘అధికారం నా చేతిలో ఉంది.. ఏం చేసుకుంటారో చేసుకోండి..’ అని దుర్భాషలాడాడని వారు పేర్కొన్నారు. అధికారుల స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే జరిగిన ఘటనపై సదరు కౌన్సిలర్‌‌ నాగరాజును వివరణ కోరగా.. లక్ష్మి కుటుంబ సభ్యులు రోడ్డుపై ప్లాస్టిక్‌ వస్తువులు పెడుతుండడంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. చాలా సార్లు వారికి చెప్పినా వినకపోవడంతో మున్సిపల్‌ అధికారులుకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.