డూప్లికేషన్, డబుల్​

డూప్లికేషన్, డబుల్​
  • జనధన్​ఖాతాలను తొలగించండి
  • బ్యాంకులకు మంత్రి నిర్మలమ్మ ఆదేశం

ముంబై: భారత్​లోని డూప్లికేషన్ జన్ ధన్ అకౌంట్లను వెంటనే తొలగించాలని రీజనల్ రూరల్ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అంటే ఒకరి పేరుపైనే రెండు జన్​ధన్​ఖాతాలు  ఉండడం ఇకపై కుదరదు. దేశ రాజధానిలో జరిగిన నార్త్ ఇండియన్ ఆర్ఆర్‌బీ సమీక్షా సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్న సందర్భంగా ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లతో ఆర్‌ఆర్‌బీలను మ్యాప్ చేయాలని సూచించారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించిన క్లస్టర్ ఏరియాల్లో గ్రామీణ శాఖల నెట్‌వర్క్‌ను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రీజనల్ రూరల్ బ్యాంకులు తమ డిజిటల్ సామర్థ్యాలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు నిర్మలా సీతారామన్. 2023 నవంబర్ 1 కల్లా గ్రామీణ బ్యాంకులన్నీ డిజిటల్ ఆన్‌బోర్డింగ్ సర్వీసులను కలిగి ఉండాలని మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం ద్వారా జన్ ధన్ అకౌంట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తొమ్మిదేళ్లలో జన్ ధన్ అకౌంట్ల సంఖ్య 50 కోట్ల మార్క్ దాటడం గమనార్హం. 2023, ఆగస్ట్ 9 నాటికి 50.01 కోట్ల జన్ ధన్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. వీటిలో ప్రభుత్వ బ్యాంకుల్లోనే 39.10 కోట్ల అకౌంట్లు తీసుకోవడం విశేషం. ఇక రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9.30 కోట్లు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 1.42 కోట్లు, రూరల్ కోఆపరేటీవ్ బ్యాంకుల్లో 19 లక్షల ఖాతాలు తెరిచారు. మొత్తంగా 50.01 కోట్ల ఖాతాల్లో మహిళల వాటానే ఎక్కువ.
50 కోట్లలో 27.78 కోట్ల ఖాతాలు మహిళల పేర్ల మీదే ఉన్నాయి. మొత్తం 50.01 కోట్ల అకౌంట్లలో రూ.2,03,853.26 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంటే రెండు లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు జన్ ధన్ అకౌంట్లలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న పేదలను బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు బ్యాంకింగ్ సేవల్ని అందించడం కోసం వీటిని పరిచయం చేసింది. జన్ ధన్ అకౌంట్‌ని జీరో బ్యాలెన్స్ అకౌంట్‌గా కూడా పిలుస్తుంటారు. ఈ పథకం ప్రారంభమైన కొన్ని వారాల్లోనే కోటీ 80 లక్షల అకౌంట్లు తెరవడం విశేషం.