జర్నలిస్టుల సమస్యలపై పార్లమెంట్​ భవన్ వద్ద జులై లో ధర్నా

జర్నలిస్టుల సమస్యలపై పార్లమెంట్​ భవన్ వద్ద జులై లో ధర్నా

 కాన్ఫెడరేషన్ పిలుపు

న్యూఢిల్లీ: అహర్నిశలు దేశ ప్రయోజనాల కోసం, ప్రజా హితం కోసం శ్రమిస్తున్న  జర్నలిస్టులు, ఇతర పత్రికా సిబ్బంది సమస్యల పట్ల  ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఏడు ప్రధాన జర్నలిస్టు సంఘాలతో కూడిన కాన్ఫెడరేషన్ ఆరోపించింది. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్​ భవన్​వద్ద నిరసనలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్, ఏజెన్సీస్ ఎంప్లాయిస్ యూనియన్ యూనియన్స్ పిలుపునిచ్చింది. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని పునరుద్ధరించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, మీడియా సంస్థల్లో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టు ల సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్ చేసింది.

మే 28న దేశ రాజధానిలో జరిగిన కాన్ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో జర్నలిస్టు సంఘాల నేతలు తెలిపారు. ఇండియన్ జర్నలిస్ట్స్  యూనియన్ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన  సర్వసభ్య సమావేశంలో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల సమస్యలన్నింటిపై చర్చించారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) Indian Journalists Union (IJU), నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా),  ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ పీటీఐ ఎంప్లాయీస్ యూనియన్, యూఎన్​ఐ వర్కర్స్ యూనియన్, ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్, ట్రిబ్యూన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 

మీడియా ప్రతినిధుల డిమాండ్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సమాఖ్యకు అనుబంధంగా ఉన్న అన్ని జాతీయ మీడియా సంస్థలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎంఎస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రపతికి, ప్రధానికి కూడా వినతి పత్రాలు అందజేయనున్నారు. దేశవ్యాప్త  ప్రచారంలో, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్య మంత్రులు, ఎంపీలకు మెమోరాండం ఇవ్వడం ద్వారా మీడియా ప్రతినిధుల డిమాండ్లపై దృష్టి సారిస్తారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ ఎదుట నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించే తేదీని త్వరలో కాన్ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించనున్నారు.

ప్రదర్శనకు ముందు దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధుల డిమాండ్లకు సంబంధించి రాష్ట్రాల్లో సదస్సులు, సెమినార్లు నిర్వహించనున్నారు. కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌గా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ రాస్ బిహారీ, ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గుప్తా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఎన్​యూజే అధ్యక్షుడు ప్రదీప్​ తివారీ, ఐఎఫ్​డబ్ల్యూజే అధ్యక్షుడు మల్లికార్జున్​, సెక్రెటరీ జనరల్​ పరమానంద పాండే, ఐజేయూ సెక్రెటరీ జనరల్​ బబల్వీందర్ సింగ్ జమ్మూ, పీటీఐ ఫెడరేషన్​ నాయకుడు భువన్​ చౌబే, యూఎన్​ఐ యూనియన్​ఎంఎల్​. జోషి, అనిల్​కుమార్​ గుప్తా, ఏఐఎన్​ఈఎఫ్​, ఎన్​ఎఫ్​ఎన్​ఈకి చెందిన పదాధికారులు  పాల్గొన్నారు.