ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి శ్రీపాదరావు - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి శ్రీపాదరావు - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. స్వర్గీయ శ్రీపాద రావు 87 వ జన్మదిన వేడుకను కలెక్టరేట్ లో  అధికారికంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి జ్యోతీ ప్రజ్వలన చేసి, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల గ్రామంలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ప్రజల కోసం ప్రజల మనిషిగా పనిచేసి రాష్ట్ర శాసన సభకు స్పీకర్ గా పనిచేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. సర్పంచ్ గా, మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొంది ఆ ప్రాంత ప్రజలకు సేవలందించారని తెలిపారు.

పార్టీలకు అతీతంగా పనిచేశారని వివరించారు. ఆయన వారసులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రిగా ఉండి ప్రజలకు సేవలందిస్తూ, జిల్లా ప్రగతి కోసం ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటు, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత మాట్లాడుతూ, శ్రీపాద రావు ప్రజలతో మమేకమైన వ్యక్తి అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి శ్రేయస్సు కోసం పాటుపడేవారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, మారుమూల, అటవీ ప్రాంతంలో జన్మించారని, అక్కడి ప్రజల కోసం కష్టపడేవారని, ఆయన జీవితం మార్గదర్శ  నీయమని అన్నారు. మంథని నియోజక వర్గంలో శాసన సభ్యులు గా ఎన్నిక అయునారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు