ప్రగతి సాధనకు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

ప్రగతి సాధనకు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గ్రామాలలో అద్భుతమైన ప్రగతి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలపై డి ఆర్ డి ఓ ,జెడ్పి సిఈఓ, ఎంపీడీవోలు ఎంపీఓలు , ఏపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పల్లెలలో స్వచ్ఛత పరిశుభ్రత పచ్చదనం సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలతో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. స్వచ్ఛభారత్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సిబ్బందికి సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాల అమలుపై కార్యదర్శులకు వర్క్ షాపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలను యజ్ఞంలో చేపట్టేందుకు వందరోజుల కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే నిర్వహించి నివేదికలను అందజేయాలన్నారు గ్రామాలలో మురుగునీరు నిలువ లేకుండా చేసేందుకు ప్రతి 15 నెలలకు ఒక కమ్యూనిటీ ఇంకుడు గుంతను నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకంజులో ఉన్న ఎంపీడీవోలకు షోకాజు నోటీలు జారీ చేయాలని జెడ్పీసీఈఓ ను ఆదేశించారు. భద్రాచలం , సారపాక , అశ్వరావుపేట , గౌతంపూర్,  ఇల్లందులలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నిర్వహణ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. సమావేశంలో డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు,  డిపిఓ రమాకాంత్ , జడ్పీ సీఈవో విద్యాలత ,అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీ ఓలు , ఏపీవోలు  పాల్గొన్నారు.