సిడ్నీ షాపింగ్ మాల్ లో ఆగంతకుడి దాడి... అయిదుగురి దుర్మరణం

సిడ్నీ షాపింగ్ మాల్ లో ఆగంతకుడి దాడి... అయిదుగురి దుర్మరణం

సిడ్నీ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని బోండి జంక్షన్‌లో రద్దీగా ఉండే షాపింగ్ సెంటర్‌లో ఈరోజు జరిగిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దుకాణదారులతో నిండిన మాల్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించి అనేక మందిని కత్తితో పొడిచాడు. తర్వాత పోలీసుల కాల్పుల్లో ఆగంతకుడు చనిపోయాడు. స్థానిక మీడియా పేర్కొన్న వివరాల మేరకు... ఈ దాడిలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. గాయపడిన వారిలో తల్లి, ఆమె బిడ్డ కత్తిపోట్లతో చికిత్స పొందుతున్నారు.

శనివారం మధ్యాహ్నం దుకాణదారులతో కిక్కిరిసిన వెస్ట్‌ఫీల్డ్ బోండి జంక్షన్ మాల్ కాంప్లెక్స్‌లో కత్తిపోట్లు సంభవించాయి. స్థానిక మీడియా ప్రసారం చేసిన సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో ఒక వ్యక్తి పెద్ద కత్తితో షాపింగ్ సెంటర్ చుట్టూ పరిగెత్తడం మరియు గాయపడిన వ్యక్తులు నేలపై పడివుండడం కనిపించింది. ఆగంతకుడు ఎందుకు ఈ దాడికి పాల్పడినదీ ఇంకా తెలియరాలేదు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ దీనిపై స్పందిస్తూ, ఇది విచారకరమైన సంఘటనగా అభివర్ణించారు. దాడిని నిలువరించడంలో పోలీసులను, ఈ సంఘటన పట్ల తొలుత స్పందించి సమాచారం అందించిన వారిని ఆయన అభినందించారు. ఈ దాడి నుంచి తప్పించుకోడానికి వివిధ చోట్ల దాక్కున్న వినియోగదారులు బయటకు వస్తున్నారు. పెద్దస్థాయిలో పోలీసు బలగాలు మాల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలతో చుట్టుపక్కల రద్దీగా ఉన్నందున, ప్రజలు ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.