ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందా?

ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందా?
  • బాధితులకు ప్రమాదం జరిగిన చోటే  ఇండ్లు నిర్మించి ఇవ్వాలి 
  • బీఆర్ఎస్ పార్టీ తరుపున లక్ష  ఆర్థిక సహాయం
  • ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మాజీ ఎంపీ వినోద్ కుమార్  

ముద్ర ప్రతినిధి, కరీంనగర్  :నగరంలో నిన్న జరిగిన భాగి అగ్ని ప్రమాద ఘటన పట్ల ఏదైనా కుట్ర జరిగిందా... లేక ప్రమాదవశాత్తు జరిగిందా... అన్న కోణంలో పోలీస్, జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి విచారణ చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలోని ఇందిరానగర్ లో  జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని బుధవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ మేచినేని వనజ అశోక్ రావుతో కలిసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ సందర్శించి పరిశీలించారు. నిరుపేద వడ్డెర కులానికి చెందిన బాదిత కుటుంబాలను వినోద్ కుమార్ పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

బాదిత కుటుంబాలందరికి కలిసి రోజు వారి ఖర్చుల కోసం తక్షణ సాయం కింద వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. గతంలో చాలా మంది వచ్చి స్థలాన్ని ఖాళీ చేయాలని వారిని ప్రలోబాలకు గురి చేశారని బాదిత కుటుంబాలు వినోద్ కుమార్ కు విన్నవించారు. దీంతో వినోద్ కుమార్ జరిగిన అగ్ని ప్రమాద ఘటన కుట్ర కోణమా లేకా ప్రమాదవశాత్తు జరిగిందా అన్న కోణంలో పోలీస్, జిల్లా యంత్రాంగం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన కు సంబంధించిన విచారణ పట్ల సిపీని కోరుతామని హామీ ఇచ్చారు. బాదిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడే వారు నివాసముండేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పోరేటర్ మేచినేని వనజ అశోక్ రావులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ... కరీంనగర్ ఇందిరానగర్ లో కూలీ నాలీ చేస్కుంటూ... జీవనం సాగించే పేదల గుడిసెలు అగ్ని ప్రమాదం లో దగ్ధం అవడం చాలా బాధకరం అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని ఆ దిశగా జిల్లా పాలానాధికారి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించి వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.