300 కోట్ల మార్కెట్ స్థలంపై పై నేతల కన్ను

300 కోట్ల మార్కెట్ స్థలంపై పై నేతల కన్ను
  • మార్కెట్ నిర్మాణం పై ఎంపీ ఎందుకు స్పందించడం లేదు
  • నిర్లక్ష్యం చేస్తే బండి ఇంటిని ముట్టడిస్తాం
  • మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నడిబొడ్డున ఉన్న 300 కోట్ల విలువ చేసే కూరగాయల మార్కెట్ స్థలాన్ని కొందరు ముఖ్య నేతలు కొట్టేసి ఫ్లాట్లు పెట్టి అమ్మాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా ఉన్న ఎంపీ బండి సంజయ్ మార్కెట్ నిర్మాణంపై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. 300 కోట్ల ప్రాపర్టీని ఎవరికి ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైజం హయాంలో నిర్మించిన మటన్ మార్కెట్, ఎలగందుల జిల్లాగా ఉన్న సమయంలో నిర్మించిన కూరగాయల  మార్కెట్ అతి పురాతనమైనవి అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్మార్ట్ సిటీ లో భాగంగా 13 కోట్లతో ఆధునిక హంగులతో మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేశారని తెలిపారు. 13 కోట్లతో మార్కెట్ నిర్మించాలని డిపిఆర్ లో పెట్టిన కూడా దానిని విరమించుకోవడం వెనక ఉన్న మతలబు ఏమిటో స్పష్టం చేయాలన్నారు. దానిని బండి సంజయ్ ఎందుకు అడ్డుకుంటున్నాడో కరీంనగర్ ప్రజలకు తెలపాలన్నారు.

నూతన మార్కెట్ నిర్మాణం పై పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే బండి సంజయ్  స్పందించాలని రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. తక్షణమే 13 కోట్ల రూపాయలు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకుంటే బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, పెండ్యాల మహేష్, మటన్ మార్కెట్ చైర్మన్ అల్తాఫ్, భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.