అధిష్టానం నిర్ణయం మేరకు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ !    

అధిష్టానం నిర్ణయం మేరకు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ !    
  • 10న నామినేషన్ దాఖలు, లక్ష మందితో బహిరంగ సభ                                                     
  • అదే రోజు బిసి డిక్లరేషన్       
  • నిజామాబాద్ అర్బన్ నుంచి నేను పోటి-మాజీమంత్రి షబ్బీర్ అలీ వెల్లడి                                      

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కేసీఆర్ పై అధిష్ఠానం నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని, 10న నామినేషన్ దాఖలు చేస్తారని మాజీమంత్రి షబ్బీర్ అలీ వెల్లడించారు.

సోమవారం కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈసందర్భంగా మాజీమంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎన్నికల్లో కెసిఆర్ ని ఓడించడానికి కార్యకర్తలు అందరూ సన్నద్ధం కావాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికల వ్యూహకర్తలుగా అరికెల నర్సారెడ్డి వేం నరేందర్ రెడ్డి కొండల్ రెడ్డిని నియమించినట్టు తెలిపారు.

కార్యకర్తలు అందరూ 25 రోజులు పగలు రాత్రి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తుందన్నారు.

ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో దిశా నిర్దేశం చేశారు.

కామారెడ్డితో తనకు 34 సవత్సరాల అనుబంధం ఉందని అన్నారు.

మైనార్టీలకు రిజర్వేషన్ పేరుతో మోసం చేసింది కేసీఆర్ అని అన్నారు.

నవంవర్ 10 నాడు రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కలిసి కామారెడ్డిలో నామినేషన్ వేస్తున్నారని,ఆనాడే బహిరంగ సభలో బిసి డిక్లరేషన్ ఇవ్వబోతున్నారని తెలిపారు.

9 నాడు నిజామాబాదులో తాను నామినేషన్ వేసి హైదరాబాద్ లో మైనారిటీ డిక్లరేషన్ చేయబోతున్నామని అన్నారు.

10 నాడు లక్ష మందితో కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని అన్నారు.

బీజేపీకి బిసి సీఎం చేస్తామని చెబుతూ బిసి నుంచి బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ ను ఎందుకు తొలగించారో ముందు చెప్పాలని ప్రశ్నించారు.

లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలులో ఉంటే కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అన్నారు.


ప్రజల సంపదను ప్రజలకు పంచకుండా పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో దొరలు పంచుకుతిన్నారని ఆరోపించారు.

కాలేశ్వరం నిర్మాణం పేరిట లక్ష కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

కాలేశ్వరం నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినందునే పట్టుమని పది రోజులు కాకముందే కాలేశ్వరం కుంగిందన్నారు.

దీంట్లో అవినీతి చేసిన వారిని కటకటాల్లో పంపిస్తామని,ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల కలలను కల్లలు చేశారని అన్నారు.

బిఆర్ఎస్ లాగా ప్రజలు మోసం చేయడం కాంగ్రెస్ కు తెలియదని,
కాంగ్రెస్ ఇప్పుడు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కూడా అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే అమలు చేస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు అది కాంగ్రెస్ పార్టీ నైజమని,తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 6 గ్యారంటీ హామీలను ప్రకటించారన్నారు.

అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్న అన్ని పార్టీల వారికి ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని,
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల పట్ల పక్షపాతం ఉండదని, కాంగ్రెస్ అంటేనే అందరి ప్రభుత్వమని అన్నారు.

ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ అధికారులకు వస్తేనే పేదలకు ఇంటి స్థలాలు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల సాయం అందుతుందని,వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, మద్దతు ధర, కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు, రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్లాల్లో దాన్యం కొనుగోలు చేస్తే..  ప్రభుత్వం మార్కెట్ కు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు, వందరోజుల ఉపాధి హామీ పని,  పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

ప్రజలు తెలంగాణ రాష్ట్ర కావాలని కోరితే ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచకుండా టిఆర్ఎస్ పాలకులు దోచుకు తింటున్నారని,. అందుకే ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలని రాహుల్ గాంధీ  చెబుతున్నారన్నారు.

ఈ ఎన్నికల్లో గెలువాల్సింది దొరలు కాదు  ప్రజలు గెలవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి. డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు. నిజామాబాద్ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి. జెడ్పి ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి.పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ. పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు గుడుగుల శ్రీనివాస్. ఇంద్రకరణ్ రెడ్డి చంద్రకాంత్ రెడ్డి కారంగుల అశోక్ రెడ్డి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి . చందు కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.