పాలమ్ముకొని ఇంజినీరింగ్ కళాశాలలు ఎలా స్థాపించారు? -కార్మిక శాఖ మంత్రికి మాజీమంత్రి షబ్బీర్ అలీ సవాల్

పాలమ్ముకొని ఇంజినీరింగ్ కళాశాలలు ఎలా స్థాపించారు? -కార్మిక శాఖ మంత్రికి మాజీమంత్రి షబ్బీర్ అలీ సవాల్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కష్టపడి పని చేసి, పాలమ్ముకొని పైకి వచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్న కార్మిక శాఖ మంత్రి, 150 రూపాయాలతోనే ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించి, ఇంత స్థాయికి ఎలా ఎదిగారని మాజీమంత్రి షబ్బీర్ అలీ  ప్రశ్నించారు.  ఐకెపి వివోఏ సమస్యల పరిష్కారం కోసం  ఉద్యోగులు గత నాలుగు రోజుల నుండి కామారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిరవధి మెరుపు సమ్మె చేస్తుండగా,  వారిని  గురువారం షబ్బీర్ అలీ కలిసి  మద్దతు తెలిపారు. 
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ చేయకూడని పని చేసి ఈడీ కేసులో ఇరుక్కున్న మహిళా నేతకు మద్దతుగా రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో మకాం వేసి, మరీ మద్దతు తెలిపారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో దొంగ పోరాటం జరిపి కేసును తప్పుదోవ పట్టించారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18వేల ఐకెపి వివోఏ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐకేపీ వివోఏ ఉద్యోగుల  దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.  వెంటనే ఐకేపీ వివోఏ ఉద్యోగులకు కనీస వేతనం 26వేలకు పెంచి, పిఆర్సి అమలు చేయాలని, వేతనాలను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. వివోఏ లకు రోజుకు కనీస వేతనం దాదాపు 150రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, 150 రూపాయలతో ఎలా జీవించాలో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారికి వివోఏ మహిళ ఉద్యోగులు కనబడటం లేదా అని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, ఐకెపి వివోఏ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  భవిష్యత్తు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే  వారి న్యాయమైన డిమాండ్లన్నీ అమలు చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు,పండ్లరాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి, ఐరేని సందీప్, గుడుగుల శ్రీను,గోనె శ్రీనివాస్, శంకర్, తదితరులుపాల్గొన్నారు.