24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ...నామినేషన్లు ఉపసంహరిస్తా

24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ...నామినేషన్లు ఉపసంహరిస్తా
  • అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలాలి              
  • ఎంఐఎం తీరు సరికాదు                                
  •  కాంగ్రెస్ ఓడించేందుకు కుట్ర  : రేవంత్ రెడ్డి    

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా నిజమని నిరూపిస్తే కామారెడ్డి, కొడంగల్లో నామినేషన్ ఉపసంహరించుకుంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు.  గత పదేళ్ల లో రాష్ట్రాన్ని దోచుకున్న అవినీతి ప్రభుత్వాన్ని  పారద్రోలాలని పిలుపునిచ్చారు.  బుధవారం కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పదేళ్ల క్రితం తెలంగాణ లో ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత విద్యుత్, పారదర్శక పాలన అందించిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే అవినీతి, అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. కాళేశ్వరం లో వేల కోట్ల అవినీతి కి పాల్పడ్డారని అన్నారు. నాడు కేసీఆర్ ఆస్తులు ఎన్ని? నేడు ఎన్ని ఉన్నాయో లెక్క కట్టలన్నారు.  ఎం ఐ ఎం నేత కేక్5ను ఎన్నికల్లో గెలిపించేందుకు లేనిపోని ఆరోపణలు తనపై చేస్తున్నారని, తీరు మార్చుకోవాలని  అన్నారు. గోశామహల్ లో బీజేపీ అభ్యర్థి పై ఎం ఐ ఎం ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీ పరోక్షంగా బీజేపీ కి సహకరిస్తూ సెక్యూలర్ పార్టీ ని ఓడించేందుకే కుట్ర పన్నారని అన్నారు. కామారెడ్డి నుంచి పోటి చేస్తున్న  కేసీఆర్, ఇక్కడి భూములను దోచునేందుకే వస్తున్నాడని  అన్నారు.  కామారెడ్డి చుట్టుపక్కల భూములు దోచుకొనేందుకే మాస్టర్ ప్లాన్ వేశారని, ప్రస్తుతం మళ్ళీ భూములు దోచుకొనేందుకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకే నేను కొడంగల్ నుంచి కామారెడ్డి వచ్చానన్నారు.  కేసీఆర్ కుటుంబం మొత్తం ఉద్యోగాలు చేస్తున్నారని, వారి  ఉద్యోగం ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పింఛన్లు రూ.4వేలు ఇస్తామని, సిలిండర్ ధరను రూ.500లకు తగ్గిస్తామని, రైతు భరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఇస్తామని అన్నారు. భూమి లేని పేదలకు ఉపాధి హామీ కింద రూ.12 వేలు ఇస్తామన్నారు.  తనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార బాధ్యత లు ఉన్నందున కామారెడ్డిలో పర్యటించలేనని, సమయం దొరికినప్పుడల్లా వస్తానని, తన గెలుపునకు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ కాలు పెట్టకుండా చేస్తామన్నారు.ఈ ఎన్నిక కామారెడ్డి, తెలంగాణకు మాత్రమే చెందినది కాదని, దేశ చరిత్రలో కీలక మలుపు తిప్పే ఎన్నిక అని, గర్వానికి, అగర్వానికి మధ్య ఎన్నిక అని తెలిపారు. ప్రజలను మభ్య పెట్టి, డబ్బులు, మద్యంతో కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్నికలో గెలవాలని ప్లాన్ చేస్తున్నాడని పేర్కొన్నారు.  

   

చర్చకు సిద్ధమా? 

ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని, రాష్ట్రంలో గత ఆరు నెలలుగా ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగా నిబద్ధత ఉంటే చర్చకు రా కేసీఆర్ అంటూ సవాల్ చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, కామారెడ్డి ఎక్కడికైనా వస్తా.. నీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని తీసుకుని కామారెడ్డి అమరవీరుల స్తూపం వద్దకు రా, 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే కామారెడ్డి, కొడంగల్లో నామినేషన్ ఉపసంహరించుకుంటా, నా సవాల్కు కేసీఆర్ సిద్ధం కావాలి, మధ్యాహ్నం 3 గంటల దాకా సమయం ఇస్తున్నానని సవాల్ చేసారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు.. కరువు వస్తుంది.. కర్ఫ్యూ వస్తుందని చెప్తున్న జాతకాలు ఏమైనా చెప్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎక్కడికెళ్లినా 24 గంటల కరెంట్ గురించి మాట్లాడరని, నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి మాట్లాడరని, మిషన్ కాకతీయ మీద మాట్లాడితే కమీషన్ల గురించి మాట్లాడతారని భయపడతారని, కాళేశ్వరం గొప్పలు చెప్పడం లేదని, సుందిళ్ళ, కుంగిన మేడిగడ్డ గురించి ప్రశ్నిస్తారని భయపడుతున్నారన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ఊసెత్తడం లేదన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేయని వాళ్ళు ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారా అని అడుగుతున్నారని, కర్ణాటకలో కాంగ్రెస్ ఓడితే బీజేపీని గెలిపించాలి అనుకున్నవా కేసీఆర్ అని సూటిగా ప్రశ్నించారు. మాజీమంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధి జరగాలంటే రేవంత్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. సమావేశంలో మాజి ఎమ్మెల్సీ ఆర్కెల నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.