21 వ తేదీ లోపు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ పూర్తి చేయాలి

21 వ తేదీ లోపు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ పూర్తి చేయాలి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే 

ముద్ర ప్రతినిధి భువనగిరి :21 వ తేదీ లోపు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే రిటర్నింగ్ అధికారులకు సూచించారు.బుధవారం ఆయన జూమ్ మీటింగ్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, ఎ.ఇ.ఆర్.ఓ.లు, సెక్టార్ అధికారులు, ఎం.పి.డి.ఓ.లు, మున్సిపల్ కమీషనర్లతో ఓటరు స్లిప్స్ పంపిణీ, వెబ్ కాస్టింగ్, సి-విజిల్ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేస్తూ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ రేపటి నుండి 21 తేదీ లోపు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తికి అందేలా చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఏరోజు ఎక్కడ ఎలా స్లిప్స్ పంపిణీ చేసేది వివరాల షెడ్యూలును వారికి తెలుపాలని, స్లిప్స్ తో పాటు ప్రతి ఇంటికి ఓటరు గైడ్ అందించాలని, అలాగే ప్రతి ఓటరుకు సి-విజిల్ యాప్ పై అవగాహన కలిగించే కరపత్రం అందించాలని, స్లిప్స్ పంపిణీలో సెక్టార్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, స్లిప్స్ పంపిణీలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని తెలిపారు. స్లిప్స్ పంపిణీపై ప్రతి రోజూ  పంపిణీ చేసిన వివరాలను పోలింగ్ స్టేషన్, నియోజక వర్గం వారిగా నివేదికలు సమర్పించాలని తెలిపారు. పంపిణీ కాని స్లిప్స్, సంబంధిత రశీదులు రిటర్నింగ్ అధికారికి అందచేయాలని సూచించారు. ఓటరు స్లిప్స్ పంపిణీ ప్రకారం ఎ.ఎస్.డి. లిస్ట్ తయారు చేయాలని తెలిపారు. జనరల్ అబ్జర్వర్ సందర్శించినప్పుడు ఓటరు స్లిప్స్ పంపిణీపై పూర్తి సమాచారం తెలిపేలా మీ కార్యాచరణ ఉండాలని తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ కోసం సిఇఓ కార్యాలయం నుండి వచ్చే ఏజన్సీ నిర్వాహకులతో  కెమెరాల సెటప్ కోసం కావలసిన ఏర్పాట్ల వివరాలను 17 తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు బూత్ లెవల్ అధికారి, లేదా సూపర్వైజరు సర్టిఫికెట్ ఇవ్వాలని, కెమెరాల ఏర్పాటు తరువాత అవి సురక్షితంగా ఉండేలా సంబంధిత హెడ్మాస్టర్లతో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతే కాకుండా పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ ఏర్పాట్లు పక్కాగా ఉన్నట్లు ముందుగానే నిర్దారించుకోవాలని, త్రి- పిన్ సాకెట్స్ తప్పసరిగా ఉండాలని, అలాగే పోలింగ్ కేంద్రాలలో వసతుల పట్ల ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని, సెక్టార్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగులు ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాలలో వీల్ చైర్స్, వాలంటీర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కు ముందు రోజు 29 తేదీ నాడు పోలింగ్ కేంద్రాలకు వచ్చే పోలింగ్ సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని, పోలింగ్ రోజు ఉదయం మాక్ పోలింగ్ కోసం బూత్ లెవల్ ఏజెంట్లను రప్పించడానికి గాను కారోబార్, విఆర్ఎ తదితరులను ముందుగానే గుర్తించి వారికి ఐడి కార్డులు ఇవ్వాలని, వారి వివరాలను ప్రిసైడింగ్ అధికారులకు ముందుగానే ఇవ్వాలని సూచించారు. సువిధ అనుమతులను సకాలంలో ఇవ్వాలని, సి-విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు ఉండాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులు రేపు 16 వ తేదీన పోటీలో ఉన్న అభ్యర్ధులు లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎం.సి.సి. ఎన్నికల నియమ నిబంధనలను వివరించాలని, ఎలక్షన్ ఎక్స్పెండీచర్ రిజిష్టర్ల నిర్వహణ, ఖర్చులకు సంబంధించి రేట్ కార్డు ఇవ్వాలని, ఓటరు స్లిప్స్ పంపిణీ షెడ్యూలు ప్రోగ్రాం ఇవ్వాలని, సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన రూట్ ప్లాన్ వివరించాలని, సువిధ ద్వారా పొందే అనుమతులను వివరించాలని, ఇందుకోసం చెక్ లిస్టుతో సిద్దం కావాలని తెలియచేస్తూ,  అభ్యర్ధులకు లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సి- విజిల్ యాప్ వారి మొబైల్స్ లో డౌన్ లోడ్ చేయించాలని, దానిని వినియోగించే పద్ధతులు వివరించాలని, వారితో సమావేశమైన  మినిట్స్ పొందుపరచాలని సూచించారు. జూమ్ మీటింగులో కలెక్టరేటు కార్యాలయం నుండి జిల్లా అదనపు రెవిన్యూ అదనపు కలెక్టరు ఏ. భాస్కరరావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.