ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ప్రజలు సహించరు..

ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ప్రజలు సహించరు..
  • మాజీ మంత్రి గుంతకండ్లకు ప్రభుత్వ విప్ బీర్ల హెచ్చరిక

ముద్ర ప్రతినిధి భువనగిరి :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజల నుండి వస్తున్న ఆదరాభిమానాలను జీర్ణించుకోలేని బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి అనేక అవాకులు చవాకులు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడాన్ని వెంటనే మానుకోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.

ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రకాష్ గార్డెన్లో నిర్వహించిన బిఆర్ఎస్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులను, ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలకు స్పందించిన రాష్ట్ర ప్రజలు సాక్షాత్తు ముఖ్యమంత్రి పోటీ చేసిన రెండు స్థానాలలో ఒక స్థానంలో ఓడించి బుద్ధి చెప్పినప్పటికీ గుర్తించకుండా నేటికీ ప్రభుత్వంలో ఉన్నామనే అహంకారంతో మాట్లాడడం మంచిది కాదని సూచించారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయానికి ముందు జగదీశ్వర్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఏమిటో గుర్తు చేసుకోవాలని చెప్పారు. జగదీశ్వర్ రెడ్డి విజయంలో కీలకపాత్ర పోషించిన వట్టి జానయ్య యాదవ్ చేసిన ఆరోపణలకు కనీసం సమాధానం చెప్పలేని జగదీశ్వర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వంపై హతమార్త ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దిగజారుడు ఆరోపణలు చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి నోట్లో యాసిడ్ పోసి శుద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా పాలన ద్వారా గడీల పాలనను రూపుమాపి ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి పై మాట్లాడుతున్న మాటలు ఒక మాజీ మంత్రిగా తన స్థాయిని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, తుర్కపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, సీనియర్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి గౌడ్ పాల్గొన్నారు.