రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి

రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి
  • నంగునూరు మండల సర్వసభ్య సమావేశంలో
  •  అధికారులపై మండిపడ్డ సభ్యులు

నంగునూరు, ముద్ర:  వడ్లు అమ్మి నెల రోజులు ఐనప్పటికీ డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నంగునూరు మండల సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేసిన అధికారుల ఆలక్ష్యం వల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని  వారు మండిపడ్డారు.  మండిపడ్డారు. సోమవారం నంగునూరు మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ జాప అరుణాదేవి అధ్యక్షతన నిర్వహించారు. వారం రోజుల్లో రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ అధికారి గీత, ఐకెపి ఏపీఎం ఆంజనేయులు సమాధానం ఇచ్చారు.

మూడు సంవత్సరాల నుంచిగ్రామపంచాయతీకి వస్తున్న శానిటేషన్ డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచులు తిప్పని రమేష్, సీత బాలయ్యలు రాజగోపాల్ పేట వైద్యాధికారి ప్రవీణ్ ను నిలదీశారు. స్థానిక సర్పంచ్, ఏఎన్ఎం జాయింట్ అకౌంట్ లో గతంలో డబ్బులు పడేవి. డబ్బులు ఆయా గ్రామాలకు వచ్చినప్పటికీ యూసీ బిల్లులు అందజేస్తే ఎవరు రసీదు ఇచ్చారో వారు అకౌంట్లో డబ్బు జమ చేసేందుకు సాఫ్ట్ వేర్ మారిందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని వైద్యాధికారి సమాధానం ఇచ్చారు. కంటి వెలుగు కార్యక్రమానికి వేళల్లో భోజనానికి ఖర్చు చేశామని కనీసం ప్రభుత్వం నుండి వచ్చే నిధులు రాకపోతే మేమేమి చేయాలని ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. 

గ్రామ సర్పంచ్ అయిన తానే రూ. లక్ష ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం రెవిన్యూ సిబ్బంది జాప్యం చేస్తున్నారని కోనాయిపల్లి సర్పంచ్ వెంకటేశం సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రభుత్వం విద్య కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్న ప్రతి గ్రామం నుండి ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్నారని ప్రజా ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు సహకరించాలని  మండల విద్యాధికారి దేశిరెడ్డి బదులిచ్చారు మండలంలో ఈ ఏడు 80 శాతం ఉత్తీర్ణత సాధించామని ఆయా పాఠశాలల్లో 18 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారని అన్నారు.

పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ నంగునూరు మండలంలోని ఘనపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించలేదని గ్రామ సర్పంచ్ బత్తుల రజిత సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. డీఏం దృష్టికి తీసుకువెళ్లి రెండు మూడు రోజుల్లో బస్సును పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారి ఏ. ఎస్ నారాయణ సమాధానం ఇచ్చారు.  మిగతా శాఖ అధికారులు వారివారి నివేదిక చదివి వినిపించారు.ఈ సమావేశంలో జడ్పిటీసీ తడిసిన ఉమా, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కర్ణ కంటి రేణుక, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దిపడగ కిష్టారెడ్డి, సొసైటీ చైర్మన్లు కోల రమేష్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీలు బెదురు తిరుపతి, కోల సునీత, మండల కోఆప్షన్ సభ్యులు ఎం.డి. రహీం, ఇంచార్జిఎంపీడీవో వేణుగోపాల్ తదితర అధికారులు  పాల్గొన్నారు.