ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు 

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు 
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ లక్ష్మన్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహావిష్ణువును పూజిస్తారని పురాణ కథనం. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్టే అని నమ్మకం.  ముక్కోటి ఏకాదశి సందర్బంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అలయ ఉత్తర ద్వారము వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారు జామున ధర్మపురి శాసన సభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు శాసన సభ్యులు గడ్డం వివేక్ లు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని కుటుంబ సమేతంగా  దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది ప్రముఖులను  శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పుర వీధుల్లో  ఊరేగింపు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే  అడ్లూరి లక్ష్మణ్ , డిసిసిబి చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, పుర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అర్చకులు పాల్గోని స్వామి వారి పల్లకి మోసారు. ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. తెల్లవారు జామునుంచి భక్తులు స్వామీ వారిని దర్శించుకున్నారు.