ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు - స్వామివారి ఉత్తర ద్వార దర్శనం

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు - స్వామివారి ఉత్తర ద్వార దర్శనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్మల్ పట్టణంలోని దేవరకోట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాధారణంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఇందుకోసం తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అయింది.

ప్రత్యేక పూజల్లో భాగంగా ధనుర్మాస సందర్భంగా తిరుప్పావై పాశురాలు పఠించారు. తులసి సహస్ర నామావళి, విష్ణు సహస్ర నామాలతో స్వామిని సేవించారు.అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాలను ఉత్తర ద్వారం గుండా బయటకు తెచ్చి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. వీధుల్లో భక్తులు గోవిందా గోవింద నామస్మరణ చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. నిర్మల్ శ్రీ దేవరకోట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి దాదాపు 400 ఏళ్ల పూర్వ చరిత్ర ఉంది. ఉదయం నుంచే అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో వేలాదిగా ప్రజలు హాజరై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్, ఈఓ రవికిషన్ పర్యవేక్షించారు.