నిర్మల్ లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం - రాష్ట్ర మంత్రి అల్లోల

నిర్మల్ లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం - రాష్ట్ర మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: క్రీడలకు ప్రోత్సాహం కల్పించేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో కూడిన క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర దేవాదాయ,అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ మిని స్టేడియంలో  వేసవి శిక్షణా శిబిరాన్ని ఆయన శుక్రవారం, ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం విద్య,  వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని, ఆ దిశగా మన ఊరు- మన బడి వంటి అనేక పథకాలు చేపడుతోందని,  అందులో భాగంగానే ఈ వేసవి సెలవులలో  విద్యార్థుల్లో శారీరక, మానసిక పరిపక్వతను తీసుకువచ్చే క్రీడలు, మైండ్ గేమ్స్ నేర్పించే దిశగా నిర్మల్ జిల్లాలో "నిర్మల్ సమ్మర్ క్యాంపు", "టీచ్ నిర్మల్" రూపొందించబడ్డాయన్నారు.

జిల్లాలో 126 క్యాంపులను ఏర్పాటు చేశామని, ఇందులో ఉదయం క్రీడలు, "టీచ్ నిర్మల్" క్రింద ఆంగ్లం, గణితం, విజ్ఞాన శాస్త్రం వంటి విషయాలలో ప్రాథమిక భావనలు నేర్పించడం జరుగుతుందన్నారు. ఇందువల్ల క్రీడలు, చదువు రెండిటికీ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. నిర్మల్ లోని  ఎన్టీఆర్ మిని స్టేడియం ను మంచి క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, డి ఇ ఓ రవీందర్ రెడ్డి, జడ్పి సీఈఓ సుధీర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ గండ్రత్  ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.