ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన నిర్మల్ వాసి సాయి ప్రసాద్

చిన్ననాటి పాఠాలు - హిమాలయాలకు సోపానాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బడికి వెళ్ళే వయసులో సార్లు చెప్పిన పాఠాలే స్ఫూర్తిగా తీసుకొని హిమాలయాలు అధిరోహించారు నిర్మల్ కు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ ముక్కా సాయిప్రసాద్. హిమాలయాల్లోని 5364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ వరకు చేరి పదుగురికి స్ఫూర్తిగా నిలిచారు. నిర్మల్ కు చెందిన 39 ఏళ్ల సాయిప్రసాద్ వృత్తి రీత్యా సి ఎ గా పని చేస్తున్నారు. చిన్నప్పుడు ఉపాధ్యాయులు చెప్పే పాఠాల్లో హిమాలయాలు ఎక్కడం కష్టం అన్న మాటను నిజం చేసి చూపాలనుకున్నారు. ఇందుకు గత కొన్ని మాసాలుగా ఎన్నో కఠినమైన  శిక్షణా కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి వారానికోసారి 100 కిలోమీటర్ల దూరం సైక్లింగ్ చేసేవారు. ఇందుకు నిర్మల్ సైక్లింగ్ క్లబ్ సభ్యుల తోడ్పాటు కూడా ఉంది. ప్రతి వారానికి రెండు సార్లు 10 కిలోమీటర్ల చొప్పున పరుగెత్తడం ద్వారా సంసిద్ధం అయ్యారు. దీనిని తోడు గుండె సంబంధ వైద్యుల సహకారంతో గుండెకు సంబంధించిన ఎక్సర్ సైజులు చేశారు. ఇలా దాదాపు 100 రోజులకు పైగా చేస్తూ సిద్ధం అయ్యారు. అనంతరం ఏప్రిల్ 29 న ప్రారంభమైన హిమాలయ అధిరోహణ మే 10 తో ముగిసింది. మే 6 న బేస్క్యాంప్ కు చేరుకున్న సాయిప్రసాద్ తిరుగు ప్రయాణం 10న ముగిసింది. సాహసోపేతమైన ఈ ట్రెక్కింగ్ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యుల సలహాలు పొందుతూ తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రథమంగా ఈ సాహసం ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

కిలిమంజారో ట్రెక్కింగ్ లక్ష్యం- సాయిప్రసాద్

ఈ సందర్భంగా '' ముద్ర" ప్రతినిధి తో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆఫ్రికా లోని కిలిమంజారో కొండను ఎక్కడం లక్ష్యమన్నారు.