దేశం చూపు కె సి ఆర్ వైపే - మంత్రి అల్లోల

దేశం చూపు  కె సి ఆర్ వైపే - మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్:  తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా గమనిస్తోందని, కె సి ఆర్ ప్రధాని అయితేనే దేశానికి భవిష్యత్తు ఉందని ప్రజలు భావిస్తున్నారనే దానికి మహారాష్ట్ర లో సభలకు లభిస్తున్న అపూర్వ ఆదరణే నిదర్శనమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, న్యాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు . భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా లోని గ్రామ గ్రామాన పార్టీ జండాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నిర్మల్ లోని దివ్య గార్డెన్ లో నియోజక వర్గ  స్థాయి ప్రతినిధులు, నేతల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ రాష్ట్రం కె సి ఆర్ హయాంలో  అన్నీ రంగాలలో అభివృద్ధి సాధించిందని, ప్రజల అపూర్వ ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు కె సి ఆర్ ప్రవేశపెట్టారని, ఈ పథకాలు తమకు కూడా వర్తింప చేయాలని మహారాష్ట్ర లో పార్టీ నిర్వహించే సభల్లో ప్రజలు కోరుకోవటం ఆయన పాలన పట్ల ఉన్న ఆదరణ ను తెలుపుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో  రాబోయే ఎన్నికలకు ఆయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందన్నారు. మారుమూల గ్రామాలలో  సైతం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మి, మాజీ డి సి సి బి ఛైర్మన్ రామకిషన్ రెడ్డి, వెంకట రమణా రెడ్డి, రఘునందన రెడ్డి, మారుగొండ రాము, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.