పోడు ప‌ట్టాల‌తో ఆదివాసీల‌కు శాశ్వత భూహక్కు

పోడు ప‌ట్టాల‌తో ఆదివాసీల‌కు శాశ్వత భూహక్కు
  • కుమ్రం భీం క‌ల‌ల‌ను సాకారం చేసిన ఘ‌న‌త సీయం కేసీఆర్ దే
  • అడ‌వుల సంర‌క్ష‌ణ‌ అందరి బాధ్యత
  • పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
  • పోడు భూమిలో అర‌క‌ పట్టి.. పొలం దున్నిన మంత్రి 

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం కలలను కూడా  సాకారం చేసిన ఘ‌న‌త ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావుకే ద‌క్కుతుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  అన్నారు. గురువారం మామడ, సారంగాపూర్ మండ‌ల కేంద్రాల్లో లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా   మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచని పోడు భూముల సమస్యను  సీయం కేసీఆర్  పరిష్కరించి, భూమి లేని నిరుపేద‌ గిరిజనులకు పట్టాలు అందించి  భూహక్కు కల్పించార‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.52 లక్షల మందికి ఏకంగా 4.50 లక్షల ఎకరాలకు పైగా పోడు ప‌ట్టాల‌ను అందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 37,000 మందికి  ల‌క్ష రెండు వేల‌ ఎక‌రాలకు పోడు ప‌ట్టాల‌ను పంపిణీ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. పోడు పట్టాలు అందుకున్న రైతులకు రైతు బంధు, రైతుబీమా కూడా వర్తిస్తుంది.