సిద్ధిపేట యువత చెంతన ఐటీ టవర్

సిద్ధిపేట యువత చెంతన ఐటీ టవర్
  • స్థానిక యువతకు అవకాశాల కల్పనే లక్ష్యం
  • జూన్ 13న సిద్ధిపేటలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలి
  •  ఐటీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష 

సిద్ధిపేట : ముద్ర ప్రతి నిధి: ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా సిద్ధిపేట ఐటీ టవర్ తెచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీశ్ రావు చెప్పారు.సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీసు కమిషనర్ శ్వేత, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ కుమార్, ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధులతో కలిసి సిద్ధిపేట ఐటీ టవర్ ప్రారంభం, ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనతో ఇప్పటికే కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ల ద్వారా ఎంతో మంది యువత ఉద్యోగాలు పొందుతున్నట్లు హరీష్ రావు చెప్పారు.సిద్ధిపేటలో సైతం 718 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఐటీ టవరులో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషకరంగా ఉన్నదన్నారు. సిద్ధిపేట ఐటీ టవర్ లో భాగస్వామ్యమయ్యే కంపెనీలకు రెండేళ్ల పాటు ఉచితంగా నిర్వహణ, అద్దె, విద్యుత్, ఇంటర్నెట్ బిల్లు ఖర్చులు భారం లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు.

వీటిలో ఓఎస్ఐ డిజిటల్, జోలాన్ టెక్, విసన్ ఇన్ఫో టెక్, అమిడాయ్ ఎడ్యుటెక్, ఫిక్సిటీ టెక్నాలజీస్, ఇన్నోసోల్, థోరాన్ టెక్నాలజీస్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్,తదితర కంపెనీలు 300 మందికి పైగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.హైదరాబాద్ నుంచి అతీ సమీపంలో ఉన్న సిద్ధిపేట ఐటీ టవర్ ఆహ్లాదకరమైన వాతావరణంలో, రాజీవ్ రహదారిపై ఉన్నదని, సమీపంలోనే త్రీస్టార్ హోటల్, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, పోలీసు కమిషనరేట్ ఉండటంతో పటిష్టమైన శాంతి భద్రతల నిర్వహణ వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామన్నారు. తమతో కలిసి వచ్చే కంపెనీలకు ఎలాంటి రాయితీలు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం సిద్ధమని, పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులకు స్థానికంగా ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.   

జూన్ నెల 13న సిద్ధిపేటలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహణకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో సమావేశమై ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా సిద్ధిపేట ఐటీ టవర్ లో భాగస్వామ్యమయ్యే కంపెనీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణతో సిద్ధం చేస్తామని తెలిపారు.కాగా స్థానిక యువత కొలువులకు రాయితీలిచ్చి కంపెనీలను ఆహ్వానించడం పట్ల మంత్రికి ఐటీ కంపెనీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. సమీక్షలో ఐటీ కంపెనీ ప్రతినిధులు అమిడ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అలుగు ముత్యం, ఓఎస్ఐ డిజిటల్ గుమ్మడి సతీశ్, ఫిక్సిటీ టెక్నాలజీస్ డెలివరీ హెడ్ శ్రీకాంత్, జోలాన్ టెక్ సంపత్, విజెన్ ఇన్ఫోటెక్ అశోక్, థోరాన్ టెక్నాలజీస్-అమెరికా రమాకాంత్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్ రాహుల్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్ పల్లవి, కామ్ సీఎక్స్ ఐటీ సర్వీసెస్ వసంత్, అమృత సిస్టమ్స్ అమరేశ్వర్,సిద్ధిపేట ఐటీ టవర్ నిర్వాహకులు చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.