పోలీస్ శాఖలో ఉన్నతమైన సంస్కరణలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే

పోలీస్ శాఖలో ఉన్నతమైన సంస్కరణలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముద్ర, ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలీస్ శాఖలో ఉన్నతమైన సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పోలీస్ స్టేషన్ల పునర్ వ్యస్థీకరణలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో  నూతనంగా ఏర్పాటు చేసిన దోమలగూడ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసిపి యాదగిరితో కలసి ప్రారంభించారు. అనంతరం వారి సమక్షంలో దోమలగూడ సిఐగా బాధ్యతలు చేపట్టిన దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఇంతకుముందు చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, ప్రజలకు విస్తృతమైన సేవలు అందించేందుకు ఇప్పుడు దోమలగూడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తినా తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వినూత్న రీతిలో ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్, షీ టీమ్స్ మంచి ఫలితాలను ఇచ్చాయని అన్నారు. దోమలగూడ సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అదుపు చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు సైతం ఎప్పటికప్పుడు సమాచారం అందించి తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి సిఐ సంజయ్ కుమార్, ముషీరాబాద్ సిఐ జహంగీర్ యాదవ్, దోమలగూడ ఎస్ఐలు చెన్ను శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కర్నె శ్రీనివాస్ రెడ్డి, గిరి శ్రీకాంత్, అనిల్ కుమార్ లతోపాటు టిఆర్ఎస్ నాయకులు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.