కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి ఇల్లు, కార్యాలయంలో ఐటీ రైడ్స్

కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి ఇల్లు, కార్యాలయంలో ఐటీ రైడ్స్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన అధికారులు ఖమ్మంలోని ఆయన ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మూకుమ్ముడిగా ప్రవేశించిన వారు పొంగులేటి సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.  తనపై ఐటీ రైడ్స్ జరుగుతాయని పొంగులేటి బుధవారం వ్యాఖ్యానించగా.. గురువారం తెల్లవారుజామునే మూడు గంటలకే అధికారులు రావడం గమనార్హం. పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ ర్యాలీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. బిజెపి, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలతో తనతో పాటు మాజీ మంత్రి , ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ను టార్గెట్ చేశారని ఇప్పటికే పొంగులేటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు పది గెలిచే విధంగా  పొంగులేటి, తుమ్మల వ్యూహాలను రచిస్తున్నారు. బీఆర్ఎస్ చెందిన అనేక మంది నేతలు ప్రజా ప్రతినిధులు కొద్దిరోజులుగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ నేపద్యంలో పొంగులేటిని కట్టడి చేసేందుకు బిజెపి, బీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.